Home నేర వార్తలు ఏసీబీ వలలో జగిత్యాల ఎఫ్‌ఆర్‌ఓ: టేకు చెట్ల నరికివేత అనుమతి కోసం ₹80 వేలు లంచం

ఏసీబీ వలలో జగిత్యాల ఎఫ్‌ఆర్‌ఓ: టేకు చెట్ల నరికివేత అనుమతి కోసం ₹80 వేలు లంచం

0
1
ACB Telangana

ACB Telangana | జగిత్యాల జిల్లా అటవీ శాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. అధికారికంగా జరగాల్సిన పని కోసం ఒక బాధితుడిని వేధిస్తూ, వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఓ ఉన్నతాధికారి గుట్టును అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రట్టు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (FRO) గులాం మొయినుద్దీన్ ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

అసలేం జరిగిందంటే..?

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పరిధిలో 120 టేకు చెట్లను నరికివేయడానికి (Felling Permission),  వాటి రవాణా అనుమతి (Transport Permit) కోసం ఒక వ్యక్తి అటవీ శాఖ అధికారులను ఆశ్రయించాడు. అయితే, ఈ అధికారిక అనుమతి పత్రాలు ఇవ్వడానికి కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గులాం మొయినుద్దీన్ (57) సదరు ఫిర్యాదుదారుడి నుండి భారీగా లంచం డిమాండ్ చేశాడు.

రూ. 2 లక్షల డీల్.. ఇప్పటికే ఒక లక్ష వసూలు

ఈ అనుమతుల కోసం ఎఫ్‌ఆర్‌ఓ మొదట రూ. 2,00,000 లంచం డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి బాధితుడు గత నెల మే 13, 2026 నాడు ఇప్పటికే రూ. 1,00,000 నగదు రూపంలో సదరు అధికారికి చెల్లించాడు. ఆ తర్వాత మిగిలిన లంచం సొమ్ము కోసం అధికారి ఒత్తిడి చేయడంతో.. బాధితుడి వినతి మేరకు ఎఫ్‌ఆర్‌ఓ లంచం మొత్తాన్ని కాస్త తగ్గించి, మిగిలిన రూ. 80,000 తక్షణమే ఇవ్వాలని హుకుం జారీ చేశాడు.

టేబుల్ డ్రాయర్‌లో లంచం సొమ్ము.. ఏసీబీ మెరుపు దాడి

లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి వ్యూహం ప్రకారం.. గురువారం (జూన్ 4, 2026) నాడు కొడిమ్యాలలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ గులాం మొయినుద్దీన్ బాధితుడి నుండి రూ. 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు మెరుపు దాడి చేశారు. అధికారి కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుండి లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ టెస్ట్ నిర్వహించి, సదరు నిందిత అధికారి అక్రమంగా, నిజాయితీ లేకుండా లంచం తీసుకున్నట్లు ధృవీకరించారు.

నిందితుడు అదుపులోకి.. ఏసీబీ కోర్టుకు తరలింపు

అవినీతికి పాల్పడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిని కరీంనగర్‌లోని గౌరవనీయ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్‌పీఈ & ఏసీబీ కేసుల కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

అవినీతిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్: 1064ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీ వద్ద లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని, బాధితుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here