టీమిండియా యువ హిట్టర్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ సూర్యవంశీ వైభవ్ పేరు దేశాన్ని దాటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఐపీఎల్ 2026లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ సీజన్ పలు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వైభవ్ ప్రదర్శనపై పలువురు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ పేరు భారత్, ఐపీఎల్ మ్యాచుల సందర్భంగానే ప్రస్తావనకు రావడమే కాకుండా.. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా వినిపించింది.లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య గురువారం(జూన్ 04) తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆటకు కాసేపు విరామం లభించింది. ఇదే సమయంలో కామెంటరీ బాక్స్‌లో మాజీ క్రికెటర్లైన ఇయాన్ వార్డ్, నాసర్ హుస్సేన్, సైమన్ డౌల్‌ల మధ్య వైభవ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టెస్ట్ క్రికెట్‌లో సూర్యవంశీతో బ్యాటింగ్ ప్రారంభించాలని వార్డ్ అనడంతో వైభవ్‌పై గురించి చర్చ ప్రారంభమైంది. అలాంటి రోజు ఎంతో దూరంలో ఉండకపోవచ్చని డౌల్ అన్నారు.