ఎన్నికల ఫలితాలకు సంబంధించి కింది కోర్టు తీర్పుపై అప్పీ్ల్ సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కేసుల్లో ఆరు నెలల్లోపు తీర్పు ఇవ్వాలని సుప్రీం స్వయంగా గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ మార్గదర్శకాలకు సుప్రీం కోర్టు కట్టుబడకపోతే చివరకు దేశంలో నిరంకుశత్వానికి దారితీస్తుందని హెచ్చరించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఇన్బదురై గెలుపును సవాలు చేస్తూ డీఎంకే నేత అప్పావు దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.2016 నాటి ఎన్నికల్లో ఇన్బదురై రాధాపురం నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే, ఈ ఫలితాన్ని అప్పావు మద్రాస్ హైకోర్టులో సవాలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్‌లో అవకతవకలు జరిపాయని అన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అప్పావుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇన్బదురై ఎన్నికను చెల్లదని తీర్పువెలువరించింది. దీంతో, ఇన్బదురై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కానీ ఇన్బదురై ఎన్నికపై తుది తీర్పును మాత్రం దాదాపు ఆరేళ్ల పాటు పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో మే 21న అప్పీలుపై విచారించిన కోర్టు 2016 నాటి అసెంబ్లీ రద్దైపోయిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసులో తీర్పు వెలువరించడం అనవసరమని అభిప్రాయపడింది. అప్పట్లో తలెత్తిన న్యాయవివాదంపై తీర్పు వెలువరించకుండానే కేసును క్లోజ్ చేసింది.ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సుప్రీం కోర్టు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల వివాదాలను ఆరు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. ప్రజాప్రతినిధుల చట్టంలోని స్ఫూర్తికి కట్టుబడి ఉండకపోతే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని వ్యాఖ్యానించింది. అందరికీ ఓటు హక్కు ఉండాలన్న స్ఫూ్ర్తి దెబ్బతింటుందని పేర్కొంది. రాజ్యాంగానికి రక్షణగా ఉండే న్యాయవ్యవస్థ ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా భారత్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడాలని పేర్కొంది. ఇక ఇన్బదురై ఎన్నికను రద్దు చేస్తూ అప్పావును విజేతగా ప్రకటించింది. అసెంబ్లీ రికార్డుల్లో ప్రతి చోట ఈ మేరకు మార్పు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది.