🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 17 June 2026, 10:42 PM Posted by: MANA VISHWAM

నీట్ రీ-ఎగ్జామ్: టెలిగ్రాంపై కేంద్రం తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET UG) పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు, ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రాం' (Telegram) సేవలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆంక్షలు జూన్ 22 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది.

​నిషేధానికి దారితీసిన కారణాలు

​ గతంలో జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు పరీక్షకు ముందే టెలిగ్రాం గ్రూపుల ద్వారా లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది.
​పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
​ఈ లీకేజీ ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు సీబీఐ (CBI) ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ తనిఖీలు చేస్తోంది.

​కోర్టుకెక్కిన టెలిగ్రాం సంస్థ

​కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టెలిగ్రాం యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. కొందరి తప్పుల వల్ల కోట్లాది మంది సాధారణ వినియోగదారులను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది. విద్య, వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం టెలిగ్రాంపై ఆధారపడిన వారు నష్టపోతున్నారని వాదిస్తూ.. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

​నేడే హైకోర్టులో కీలక విచారణ

టెలిగ్రాం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ తేజాస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. పరీక్షల భద్రత వర్సెస్ వినియోగదారుల హక్కుల నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
🏠 Home