🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 19 June 2026, 08:43 AM Posted by: MANA VISHWAM

బ్లాక్ లిస్ట్‌లో భూమి.. తహసీల్దార్‌పై చర్యలేవి?

కోర్టు వివాదంలో ఉన్న భూమికి మ్యూటేషన్.. తర్వాత సర్వే నంబర్ బ్లాక్

బాధితుల ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలు

పరకాల తహసీల్దార్ వ్యవహారంపై ఉన్నతాధికారుల మౌనం ప్రశ్నార్థకం

కోర్టు వివాదంలో ఉన్న భూమికి మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారం హన్మకొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమ మ్యూటేషన్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత సర్వే నంబర్‌ను అధికారులు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినా, ఈ నిర్ణయం ద్వారా తప్పు జరిగిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్టేనని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే వివాదాస్పద భూమికి మ్యూటేషన్ చేసిన తహసీల్దార్‌పై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా పరకాల మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 665లో గల 16 గుంటల భూమిపై ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేదా మ్యూటేషన్లు చేపట్టవద్దని బాధితులు గత మార్చి నెలలోనే పరకాల తహసీల్దార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా, సదరు భూమిని ఇద్దరు వ్యక్తులకు చెరో 8 గుంటల చొప్పున మ్యూటేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు సమాచారం. కోర్టు పరిధిలో ఉన్న భూమిపై ఈ చర్యలు ఎలా జరిగాయనే ప్రశ్నలు ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

ఆందోళనల తర్వాతే బ్లాక్ లిస్ట్

ఈ వ్యవహారం బాధితులకు తెలిసిన వెంటనే వారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగినట్లు సమాచారం. పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి యత్నానికి దిగుతామని హెచ్చరించడంతో పాటు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ అంశం పలు పత్రికల్లో ప్రచురితమవడంతో అధికారులు స్పందించి సంబంధిత సర్వే నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
అయితే ఒకవైపు సర్వే నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం ద్వారా అక్రమం జరిగినట్లు అంగీకరించినట్టే అయితే, మరోవైపు ఆ అక్రమానికి బాధ్యులైన తహసీల్దార్ విజయ లక్ష్మి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

ముడుపుల ఆరోపణలు

కోర్టు వివాదంలో ఉన్న భూమికి మ్యూటేషన్ జరగడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ నిబంధనలను అతిక్రమించి వివాదాస్పద భూమికి పట్టాలు జారీ చేయడం వెనుక పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నతాధికారుల మౌనంపై ప్రశ్నలు

సర్వే నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన తర్వాత కూడా సంబంధిత తహసీల్దార్‌పై ఎలాంటి చర్యలు లేకపోవడంతో జిల్లాలో పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. "తప్పు జరిగినట్లు తెలిసినా ఎందుకు చర్యలు లేవు?", "ఎవరైనా అధికారిని కాపాడుతున్నారా?", "లేదా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారా?" అనే చర్చలు కలెక్టరేట్ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను వెలికితీయాలని బాధితులు కోరుతున్నారు.


"సర్వే నంబర్ బ్లాక్.. బాధ్యులు ఫ్రీ?"
కోర్టు కేసులో ఉన్న భూమికి మ్యూటేషన్ జరిగిందని ఆరోపణలు రావడంతో సర్వే నంబర్ 665ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. అయితే అక్రమ నిర్ణయం తీసుకున్న వారిపై చర్యలు లేకపోవడం పట్ల బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "భూమిని బ్లాక్ చేస్తే సరిపోతుందా? తప్పు చేసిన అధికారులపై చర్యలు ఎప్పుడు?" అని ప్రశ్నిస్తున్నారు.
🏠 Home