🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 19 June 2026, 10:00 PM Posted by: MANA VISHWAM

క్రీడా తెలంగాణ దిశగా భారీ అడుగు

రూ.50.73 కోట్లతో క్రీడా మౌలిక వసతుల విస్తరణ

రాష్ట్రవ్యాప్తంగా మినీ స్టేడియంలు, శిక్షణా అకాడమీలకు శ్రీకారం

గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలే లక్ష్యం

తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50.73 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త క్రీడా అకాడమీలను ప్రారంభించడంతో పాటు జిల్లాల్లో నిర్మించనున్న మినీ స్టేడియాల పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు కూడా నగరాల్లో ఉన్నట్లే ఆధునిక క్రీడా వసతులు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.10 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణకు మరో రూ.10 కోట్ల నిధులను కేటాయించారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో రూ.4 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు.
వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో రూ.4 కోట్లతో బహుళ ప్రయోజన క్రీడా సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో మైదానాలతో పాటు క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రూ.3.50 కోట్లతో, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో రూ.2.50 కోట్లతో వాలీబాల్, కబడ్డీ మైదానాలను ఏర్పాటు చేయనున్నారు.
క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. గచ్చిబౌలిలో బాలుర కోసం ప్రతిభా వికాస అకాడమీని ప్రారంభించగా, బాలికల కోసం అథ్లెటిక్స్, హాకీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎల్‌బీ స్టేడియంలో బాలుర కోసం ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ అకాడమీలను ప్రారంభించారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆధునిక క్రీడా సౌకర్యాలను విస్తరించి యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభ వెలుగులోకి వస్తుందని, భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరింత మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు, కోచ్‌లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు మైలురాయిగా నిలవనున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
🏠 Home