🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 19 June 2026, 10:39 PM Posted by: MANA VISHWAM

HCA అవినీతి ఆరోపణలపై లోకాయుక్త కీలక ఆదేశాలు

4 వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం

15 ఏళ్లలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందన్న టీసీఏ ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారంపై తెలంగాణ లోకాయుక్త కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) చేసిన ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా విచారించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఐడీని ఆదేశించింది.
హెచ్‌సీఏలో గత 15 ఏళ్ల కాలంలో సుమారు రూ.600 కోట్ల మేర అవినీతి జరిగిందని టీసీఏ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణను వేగవంతం చేయాలని లోకాయుక్త స్పష్టం చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సీఐడీ అధికారులను లోకాయుక్త ఆదేశించింది. హెచ్‌సీఏలో ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.
లోకాయుక్త తాజా ఆదేశాలతో హెచ్‌సీఏ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీఐడీ విచారణ నివేదిక అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
🏠 Home