🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 22 June 2026, 06:25 PM Posted by: MANA VISHWAM

బీఆర్ఎస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం: ఎమ్మెల్యే నాయినికి కంజర్ల మనోజ్ హెచ్చరిక

హన్మకొండ, జూన్ 22​(మన విశ్వం ):వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్ కుమార్ ఘాటుగా హెచ్చరించారు. సోమవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.​ఇటీవల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డిలపై ఎమ్మెల్యే నాయిని చేసిన విమర్శలను మనోజ్ తీవ్రంగా ఖండించారు.

​​అభివృద్ధి శూన్యం – విమర్శలు ఘనం

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని,పశ్చిమ లో ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని, విమర్శలు మాత్రం ఘనంగా చేస్తున్నారని అన్నారు.కేవలం బీఆర్ఎస్ నాయకులపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

​సేవా కార్యక్రమాలపై విమర్శలా?

ఇటీవల దుగ్గెంపూడి రంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా సుమారు 600 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ఫీజుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ మంచి కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే విమర్శించడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. "పేద పిల్లల కోసం కనీసం ఒక పెన్సిల్ అయినా పంపిణీ చేసే మనసు ఎమ్మెల్యేకు ఉందా?" అని ప్రశ్నించారు.

​ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎమ్మెల్యే నాయిని ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని, ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకుని నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయం చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కంజర్ల మనోజ్ స్పష్టం చేశారు.
🏠 Home