🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 24 June 2026, 10:36 PM Posted by: MANA VISHWAM

ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక: రంగంలోకి ‘బాస్‌ స్కామ్‌’!

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలను ఎంచుకుంటూ అమాయకులను, సంస్థలను దోచుకుంటున్నారు. తాజాగా 'బాస్ స్కామ్ '‘పేరిట సరికొత్త మోసానికి తెరలేపినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ బ్యూరో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

​లక్ష్యం ఎవరంటే..?

​ఈ సరికొత్త సైబర్ దాడిలో ప్రధానంగా వ్యాపార సంస్థల అధిపతులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, ప్రభుత్వ ఉన్నతాధికారులను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి పేరుతో లేదా వారిని బురిడీ కొట్టించేలా ఈ మోసాలకు పాల్పడుతున్నారు.

​మోసం జరిగే విధానం

​నేరగాళ్లు ఇమెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా బాధితులకు మోసపూరితమైన ఫైళ్లను (Malicious Files) పంపుతారు. అవి ముఖ్యమైన కంపెనీ ఫైళ్లుగా లేదా అత్యవసర డాక్యుమెంట్లుగా నమ్మిస్తారు. అధికారులు ఆ ఫైళ్లను క్లిక్ చేసి తెరవగానే, వారి సిస్టమ్‌ లేదా మొబైల్‌లోకి ప్రమాదకరమైన 'మాల్వేర్' ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది.
మాల్వేర్ సహాయంతో నేరగాళ్లు సదరు అధికారి కంప్యూటర్‌ను, వాట్సాప్‌ ఖాతాను పూర్తిగా హ్యాక్‌ చేస్తారు. ఆపై వారి డేటాను దొంగిలించడం లేదా వారి పేరుతో కింది స్థాయి సిబ్బందికి మెసేజ్‌లు పంపి డబ్బులు గుంజడం వంటి పనులకు పాల్పడతారు.

​సైబర్ బ్యూరో జాగ్రత్తలు

"అపరిచిత వ్యక్తుల నుంచి లేదా అనుమానాస్పదంగా వచ్చే ఎలాంటి ఇమెయిల్స్, వాట్సాప్ ఫైళ్లను (PDF, APK, Link) క్లిక్ చేయవద్దు. అత్యవసరమైన ఫైల్స్ వస్తే, పంపిన వ్యక్తి ఎవరో ఫోన్ ద్వారా నిర్ధారించుకున్నాకే వాటిని ఓపెన్ చేయాలి." ​కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరింది. ​
🏠 Home