🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 27 June 2026, 09:49 PM Posted by: MANA VISHWAM

ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధనలు

500–750 చదరపు అడుగులకే స్లాబ్ పరిమితి

ఇంటి ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి అనుమతి

గృహ నిర్మాణశాఖ తాజా ఉత్తర్వులు నేటి నుండి అమల్లోకి

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేలా ఇళ్ల స్లాబ్ విస్తీర్ణంపై కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ ఉత్తర్వులు విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ విస్తీర్ణం కనిష్ఠంగా 500 చదరపు అడుగులు, గరిష్ఠంగా 750 చదరపు అడుగుల వరకు మాత్రమే ఉండాలి. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రణాళికల ప్రకారమే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది.
ఉత్తర్వుల ప్రకారం ఇంటి ముందు భాగంలో స్లాబ్ మూడు అడుగుల వరకు, మిగిలిన మూడు వైపులా ఒక్క అడుగు వరకు మాత్రమే ప్రొజెక్షన్ ఉండేలా నిర్మించాల్సి ఉంటుంది. అలాగే 400 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు గరిష్ఠంగా 500 చదరపు అడుగుల వరకు, 600 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకు గరిష్ఠంగా 750 చదరపు అడుగుల వరకు స్లాబ్ నిర్మించుకునే అవకాశం కల్పించారు.
ఇంటి ముందు అదనపు కవరేజ్ అవసరమైతే స్లాబ్‌ను విస్తరించకుండా రేకులతో షెడ్డు నిర్మించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతించిన బిల్డింగ్ ప్లాన్‌కు మించి మూడు నుంచి ఎనిమిది అడుగుల వరకు మాత్రమే స్లాబ్ ప్రొజెక్షన్లను విస్తరించేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మించి లబ్ధిదారులు అదనపు వ్యయం చేయాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. స్లాబ్ పరిమాణం పెరగడం వల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరుగుతోందని గుర్తించిన నేపథ్యంలో ఈ పరిమితులను అమలు చేస్తున్నట్లు వివరించింది.ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇకపై కొత్తగా ప్రారంభించే ఇందిరమ్మ గృహాల నిర్మాణాలకు ఇవే మార్గదర్శకాలుగా వర్తిస్తాయని గృహ నిర్మాణశాఖ స్పష్టం చేసింది.
🏠 Home