🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 29 June 2026, 09:39 AM Posted by: MANA VISHWAM

'బెయిల్ భయం'తోనే 2,900 ఎకరాలు కేంద్రానికి అప్పగించారు

వికారాబాద్ అడవులు, మూసీ నది, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశాలపై తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెయిల్ రద్దవుతుందనే భయంతోనే వికారాబాద్ జిల్లాలోని 2,900 ఎకరాల భూమిని దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కోసం అప్పగించారని ఆరోపించారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దామగుండం రాడార్ ప్రాజెక్టు కోసం 12 లక్షల చెట్ల నరికివేతకు మాజీ సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం అడిగిన వెంటనే అడవులను త్యాగం చేసిందని విమర్శించారు.
మూసీ నది పుట్టిన ప్రాంతంలోనే చెట్లను నరికి, మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపడతామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని, అసలు లక్ష్యం కమిషన్లేనని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి వికారాబాద్ అడవులతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా ప్రమాదంలోకి నెట్టుతున్నాయని అన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు ప్రాంతాలతో పాటు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం పంపులు ప్రారంభించడం మాత్రమే మిగిలి ఉందన్నారు. అయితే ప్రాజెక్టు పూర్తయితే ప్రజలు కేసీఆర్‌ను గుర్తుంచుకుంటారనే రాజకీయ కారణంతోనే ప్రస్తుత ప్రభుత్వం పనులను నిలిపివేసిందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో వికారాబాద్ జిల్లాకు కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడంలో విఫలమైందని విమర్శించారు.

తెలంగాణ అప్పులపై స్పీకర్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం తగదని హితవు పలికారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) గణాంకాల ప్రకారం 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర అప్పు రూ.72 వేల కోట్లు ఉండగా, 2023 డిసెంబర్ నాటికి మొత్తం అప్పు రూ.3.52 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అదనపు అప్పు సుమారు రూ.2.80 లక్షల కోట్లేనని, ఇది కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో వెల్లడించిన లెక్కలని చెప్పారు.
అయితే రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని కాంగ్రెస్ నేతలు, మంత్రులు, స్పీకర్ వేర్వేరుగా చెబుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజాప్రతినిధులు అధికారిక గణాంకాల ఆధారంగానే మాట్లాడాలని ఆయన సూచించారు.
🏠 Home