🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 01 July 2026, 08:40 AM Posted by: MANA VISHWAM

కుడా భూముల వేలంలో రూ.50 కోట్ల అవినీతి?

​భద్రకాళి గుడిలో ప్రమాణానికి నేను సిద్ధం..

కాంగ్రెస్ నేతలకు దమ్ముందా?:కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవారెడ్డి సవాల్‌

​బాలసముద్రం భూముల విక్రయంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి

​సిండికేట్‌గా మారి మార్కెట్ ధర కంటే సగానికే కొట్టేశారు!

​వేలాన్ని రద్దు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ డిమాండ్


కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బాలసముద్రం భూముల వేలంలో భారీ అవినీతి చోటుచేసుకుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, కుడా మాజీ ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు పథకం ప్రకారం వేలం ప్రక్రియను ప్రభావితం చేసి, ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొట్టారని విమర్శించారు. మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్ వెనుక వేలం వేసిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అక్రమ వేలాన్ని వెంటనే రద్దు చేసి, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

​గజం రూ.1.50 లక్షలు ఉంటే.. రూ.66 వేలకే ఇచ్చేస్తారా?

​జూన్ 21న కుడా పరిధిలోని 2 ఎకరాల 27 గుంటల విలువైన భూమిని మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు విక్రయించారని యాదవరెడ్డి ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో ఇక్కడ గజం ధర సుమారు రూ.1.50 లక్షల వరకు పలుకుతుండగా.. వేలంలో మాత్రం సిండికేట్‌ పద్ధతిలో రూ.66 వేల నుంచి రూ.69 వేల మధ్యే దక్కించుకున్నారని మండిపడ్డారు. వేలంలో పాల్గొనేందుకు వచ్చిన ఇతర కొనుగోలుదారులను స్థానిక కాంగ్రెస్ నేతల పేర్లు చెప్పి బెదిరించారని, ప్రలోభాలకు గురిచేసి పోటీ నుంచి తప్పుకునేలా చేశారని ధ్వజమెత్తారు. ఈ కుంభకోణం వల్ల కుడాకు దాదాపు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దీనిపై సమాధానం చెప్పలేక అధికార పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటని అన్నారు.

​తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధం!

​"మేం చేస్తున్న అవినీతి ఆరోపణలు అసత్యమని కాంగ్రెస్ నేతలు భావిస్తే.. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలి. నేను శుక్రవారం ఉదయాన్నే తడిబట్టలతో స్నానం చేసి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అధికార పార్టీ నాయకులకు అంత నిజాయితీ, ధైర్యం ఉంటే ఆలయానికి వచ్చి ప్రజల ముందు ప్రమాణం చేయాలి" అని మర్రి యాదవరెడ్డి సవాల్ విసిరారు.

​సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి..

​బాలసముద్రం భూముల వేలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని యాదవరెడ్డి డిమాండ్ చేశారు. విలువైన ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు కట్టబెట్టడం మానేసి, అక్కడ నిరుపేదలకు ఉపయోగపడే సమీకృత పాఠశాల (ఇంటిగ్రేటెడ్ స్కూల్) లేదా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని సూచించారు.
​మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ నేత ఇనగాల వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల తీర్పు పొందని వ్యక్తులు కేవలం రాజకీయ ఉనికి కోసమే సీనియర్ నేతలపై విమర్శలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
​ఈ కార్యక్రమంలో జోరిక రమేష్, సోదా కిరణ్,సంకు నర్సింగ్,నార్లగిరి రమేష్, ఉడుతల సారంగపాణి, కంజర్ల మనోజ్‌కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home