🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 July 2026, 10:20 AM Posted by: MANA VISHWAM

​డాక్టర్‌ నిర్వాకం: ప్రాణాలమీదకు తెచ్చిన ఆపరేషన్లు.. బాధితుడికి రూ.19 లక్షల నష్టం!

ప్రభుత్వ ఆసుపత్రిలో నమ్మకంగా చికిత్స పొందుతున్న ఒక పేద వ్యవసాయ కూలి ప్రాణాలను ముప్పులోకి నెట్టి, ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిప్పి లక్షలాది రూపాయలు నష్టపోయేలా చేసిన ఒక డాక్టర్ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన లింగధరి రాజేశ్వర రావు (56) అనే వ్యవసాయ కూలికి ఈ ఏడాది జనవరి 24న తీవ్రమైన పొత్తికడుపు నొప్పి వచ్చింది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆయన వరంగల్‌లోని ఎం.జి.ఎం. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు (జనవరి 25న) అక్కడ ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. అయితే ఆ ఆపరేషన్ విజయవంతం కాలేదు.

​ప్రైవేటు ఆసుపత్రికి సిఫార్సు.. రూ.2.80 లక్షల వసూలు

ఎం.జి.ఎం. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కూరపాటి రమేశ్.. బాధితుడి వద్దకు వచ్చి, "ఇక్కడ ఉంటే నీ ప్రాణానికి ముప్పు వస్తుంది, నేను చెప్పిన ఆసుపత్రిలో చేరండి" అని నమ్మబలికారు. ఆయన మాటలు నమ్మి బాధితుడు ఏకశిలా ఆసుపత్రిలో చేరగా, అక్కడ రెండవసారి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ కూడా విఫలం కావడమే కాకుండా, ఆసుపత్రి ఖర్చుల పేరిట రూ. 2,80,000/- వసూలు చేశారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో "ఇక్కడ ఉంటే చనిపోతావు, నిమ్స్‌కు వెళ్ళిపో" అంటూ డాక్టర్ చేతులెత్తేశారని భాదితులు తెలిపారు.

​నిమ్స్ నిరాకరణ.. యశోదలో ప్రాణదానం

బాధితుడు తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళగా, అప్పటికే వరుస ఆపరేషన్లు జరగడం వల్ల కొంత వ్యవధి లేకుండా వెంటనే మళ్ళీ ఆపరేషన్ చేయడం కుదరదని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రాజేశ్వర రావును చూసి చలించిపోయిన ఆయన గ్రామస్థులు, బంధువులు కలిసి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఇటీవల చేసిన ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. అయితే ఈ చికిత్స కోసం బంధువులు ఏకంగా రూ. 16,60,000/- (పదహారు లక్షల అరవై వేల రూపాయలు) అప్పులు చేసి చెల్లించాల్సి వచ్చింది.

​చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓకు వేడుకోలు

ప్రస్తుతం ప్రాణాలతో బయటపడినప్పటికీ, తన ఆరోగ్య పరిస్థితి ఇంకా అంతంత మాత్రంగానే ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యానికి, ఆర్థిక నష్టానికి కారణమైన డాక్టర్ కూరపాటి రమేశ్ మరియు ఆయనకు సంబంధించిన ఆసుపత్రులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు రాజేశ్వర రావు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టింది.
🏠 Home