🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 July 2026, 10:23 AM Posted by: MANA VISHWAM

​సంజీవని ఆస్పత్రి సేవలు అమోఘం: మాజీ మంత్రి హరీశ్‌రావు

'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు, హీరో విజయ్ దేవరకొండ

​ఆస్పత్రి ట్రస్ట్‌కు తన ఏడాది జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే

​చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయడం అభినందనీయం

​ జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రి అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అమోఘమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. శనివారం ఆస్పత్రిలో నిర్వహించిన 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, వారి కుటుంబాల్లో కొత్త ఆశలు వెలిగిస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని, వైద్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ గొప్ప ఆశయానికి తన వంతు మద్దతుగా.. తన ఏడాది జీతాన్ని ఆస్పత్రి ట్రస్ట్ కు విరాళంగా ఇస్తున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు.

​శ్రీనివాస్ కనిపిస్తున్న దేవుడు

​ఆస్పత్రి వ్యవస్థాపకుడు శ్రీనివాస్ సేవలను హరీశ్‌రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. "దేవాలయంలో కనిపించని దేవుడిని మనం పూజిస్తాం.. కానీ, తన సొంత సంపాదనతో వేలాది మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తూ, వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్న శ్రీనివాస్ గారు మనకు కనిపించే నిజమైన దేవుడు" అని అభివర్ణించారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది పేద పిల్లలు ఇక్కడికి వచ్చి ఉచితంగా నయమై ఆరోగ్యంగా తిరిగి వెళ్లడం సంతోషకరమన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులను మించిన పరిశుభ్రత, వైద్య సేవలు, ఇక్కడి సిబ్బంది చూపే ఆప్యాయత ఎంతో గొప్పవని కొనియాడారు.

​"మనిషి జీవితంలో పదవులు, సంపద కంటే ఇతరులకు చేసే సేవే శాశ్వతంగా నిలిచిపోతుంది. సమాజ సేవకు పెద్ద సంపద అక్కర్లేదు, సాయం చేయాలనే మంచి మనసు ఉంటే చాలు."అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

​తాను ప్రతి ఏటా ఈ ఆస్పత్రిని సందర్శిస్తానని, భవిష్యత్తులోనూ ఇక్కడి సేవా కార్యక్రమాలకు తన అండదండలు ఉంటాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండ, ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందితో పాటు లబ్ధి పొందిన చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంజీవని ఆస్పత్రి చేస్తున్న ఈ మహత్కార్యానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వక్తలు పిలుపునిచ్చారు.
🏠 Home