🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 05 July 2026, 10:39 AM Posted by: MANA VISHWAM

పేదల సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పట్టణ గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

​తొలి విడతగా 26 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం

​రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు శాశ్వత భవనాలు

​అధికారుల సమీక్షలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఆదేశం

​రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పట్టణ ప్రాంతాల గృహ నిర్మాణ పథకం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల శాశ్వత భవనాల నిర్మాణ పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
​ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో పట్టణ ప్రాంతాల్లోనూ అర్హులైన పేదలకు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సూచించారు.

​ఉపాధికి దూరం కాకుండా పట్టణ ఇళ్ల నిర్మాణం

​పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల జీవనోపాధి దెబ్బతినకుండా, వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.ఇందుకోసం రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఇప్పటికే సేకరించిన స్థలాల్లో పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
​ఇంకా స్థలాలు ఖరారు కాని నియోజకవర్గాల్లో తక్షణమే అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.పట్టణ అభివృద్ధి పరిధిలోని 26 నియోజకవర్గాల్లో తొలి విడతగా.. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఇళ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి, నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో ప్రజలకు అందిస్తామన్నారు.

​ప్రభుత్వ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు

​ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖలకు సొంత, శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.ఆర్డీవో కార్యాలయాలు 10,తహసీల్దార్ కార్యాలయాలు 107,స్టాంపులు -రిజిస్ట్రేషన్ డి ఐ జీ ఆఫీసులు 02,జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు 04,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 52
​ఈ భవనాలన్నీ కూడా ఒకే నమూనాలో (యూనిఫాం మోడల్), ఆధునిక సౌకర్యాలతో, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాంగణాల్లో విద్యుత్ ఆదా చేసేలా సోలార్ పార్కింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
​ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
🏠 Home