🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 July 2026, 10:44 PM Posted by: MANA VISHWAM

బీసీ రిజర్వేషన్ల సాధనకు ఆగస్టు 6న హైదరాబాద్‌లో ‘మహాసభ’

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా వచ్చే నెల (ఆగస్టు) 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ నాయకుల కీలక సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని ఈ సభకు ‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’గా నామకరణం చేసినట్లు తెలిపారు.

​దేశవ్యాప్త ఉద్యమానికి వేదిక..

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలుగన్న సామాజిక న్యాయ తెలంగాణ ఆవిష్కరణ కోసం బీసీల హక్కుల పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన గత రెండేళ్లుగా క్షేత్రస్థాయిలో పోరాడుతున్నాయని గుర్తు చేశారు. ఆగస్టు 6న హైదరాబాద్‌లో జరగబోయే మహాసభ దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి సరికొత్త దిశానిర్దేశం చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నాడు తమిళనాడులో పుట్టిన మధ్యాహ్న భోజన పథకం దేశమంతటా ఎలా విస్తరించిందో.. నేడు తెలంగాణలో మొదలైన ఈ 50 శాతం రిజర్వేషన్ల ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
​కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్‌..
రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలిలో బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ, వాటి సాధన కోసం ఆశించిన స్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదని కవిత విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి సమాజంలోని అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తెస్తామన్నారు.

​‘మనమెంతో.. మనకంత’

"మనమెంతో.. మనకంత" అనే సామాజిక నినాదం సాకారం కావాలంటే బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం సాగించే ఈ సామాజిక న్యాయ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, ఆగస్టు 6న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కవిత కోరారు. ఈ సమావేశంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
🏠 Home