🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 July 2026, 10:47 PM Posted by: MANA VISHWAM

అవయవ మార్పిడి సేవలకు ‘టిమ్స్‌’ సిద్ధం

సనత్‌నగర్‌లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్‌)ను అన్ని రకాల అవయవ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్‌) శస్త్రచికిత్సలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఆయన నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లతో కలిసి టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ-ఆపరేటివ్, పోస్ట్-ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​దశలవారీగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు..

అనంతరం వైద్య నిపుణులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వ రంగంలోనే అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. టిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను మరింత విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్యులను కోరారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు, నిధులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, టిమ్స్‌లో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు సిద్ధంగా ఉన్నాయని.. దశలవారీగా కిడ్నీ, కాలేయం (లివర్), గుండె తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఇక్కడ ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సర్జన్లు మంత్రికి వివరించారు.

​నిమ్స్, గాంధీ ఆస్పత్రులపై తగ్గనున్న ఒత్తిడి..

నిమ్స్‌లో పరిమిత ఆపరేషన్ థియేటర్ల కారణంగా క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం రోగులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తోందని వైద్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి.. నిమ్స్‌లో పెండింగ్‌లో ఉన్న న్యూరో సర్జరీలు, కిడ్నీ మార్పిడి, గుండె శస్త్రచికిత్సలను టిమ్స్‌లో నిర్వహించేలా తక్షణ కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను నిమ్స్ తరహాలోనే స్వయంప్రతిపత్తి (అటానమస్) కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడంతో పాటు, రోగులు నెలల తరబడి నిరీక్షించే అవస్థలు తప్పుతాయని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. భేటీలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రముఖ సర్జన్లు పాల్గొన్నారు.
🏠 Home