🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 07 July 2026, 07:36 AM Posted by: MANA VISHWAM

కలెక్టర్ ‘చర్య’లకే తూట్లు! ​‘సివిల్ సప్లై’ ప్రధాన కార్యాలయంలో తిరోగమన పోస్టింగులు

అవినీతి ‘టెక్నికల్ అసిస్టెంట్’కు మళ్లీ అందలం

​వరంగల్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు .. సివిల్ సప్లై కమిషనర్‌కూ తెలియకుండానే మాయాజాలం!

​మిల్లర్లతో కుమ్మక్కై నాసిరకం బియ్యం పాస్ చేసినా వెనకేసుకొచ్చిన ‘కీలక’ అధికారి, వరంగల్ మాజీ డీఎం

​ఏడాది తిరగకముందే భూపాలపల్లిలో తిష్ట వేసిన వైనం



క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగమే అవినీతిపరులకు అండగా నిలుస్తోంది. ఒక జిల్లా కలెక్టరు స్వయంగా రంగంలోకి దిగి, నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేసిన వైనాన్ని పట్టుకుని, సదరు ఔట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ (టి.ఎ)పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే.. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్) ప్రధాన కార్యాలయంలోని కొందరు పెద్దలు దాన్ని తుంగలో తొక్కారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఏడాది కూడా గడవకముందే సదరు ఉద్యోగిని మరో జిల్లాలో కీలక పోస్టులో కూర్చోబెట్టి ‘అందలం’ ఎక్కించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు సైతం తెలియకుండా హెడ్ ఆఫీసులో జరిగిన ఈ ‘పోస్టింగ్’ వ్యవహారం ఇప్పుడు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

​అసలేం జరిగిందంటే..?

​గత సంవత్సరం వరంగల్ జిల్లాలోని చలపర్తి ‘ఎస్.డబ్ల్యూ.సి’ గోదాముకు రాధాకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, గోపీకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్ సంస్థలు సరఫరా చేసిన 10 శాతం స్టీమ్ సన్నబియ్యం నిల్వలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నాణ్యత లేని బియ్యాన్ని గోదాముల్లోకి అనుమతిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో క్వాలిటీ కంట్రోల్ (QC) మేనేజర్, దుగ్గొండి తహసీల్దార్ , నర్సంపేట ఆర్.డీ.ఓలతో కూడిన ఉన్నతాధికారుల బృందం రంగంలోకి దిగి 11 బియ్యం నమూనాలను పరీక్షించింది.
​ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఏసికే( ACK) నంబర్లు 10418, 11265, 9061 ల కింద సేకరించిన బియ్యంలో దెబ్బతిన్న గింజలు, రంగు మారిన గింజలు నిర్దేశిత రిజెక్షన్ పరిమితిని మించి ఉన్నట్లు నిర్ధారించారు. మిల్లర్లతో కుమ్మక్కై నాసిరకం బియ్యాన్ని పాస్ చేసినట్లు తేలడంతో, సదరు టెక్నికల్ అసిస్టెంట్ డి. 'అరవింద్‌'పై కఠిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని వరంగల్ అదనపు కలెక్టరు కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ వీసీ & మేనేజింగ్ డైరెక్టర్‌కు ఫైలు పంపారు. వెంటనే అప్పటి వరంగల్ జిల్లా మేనేజర్ ఆ 'టి.ఎ' ను హెడ్ ఆఫీస్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

​చక్రం తిప్పిన ‘కీలక’ అధికారి, మాజీ డీఎం!

​కలెక్టర్ కార్యాలయం నుంచి వెళ్లిన ఈ అవినీతి నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక అధికారి(గతంలో వరంగల్ జిల్లా డీఎం గా విధులు నిర్వహించిన) చక్రం తిప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారి అండదండలతో సదరు 'టి.ఎ' ఫైలును పక్కన పడేశారు. కనీసం 'పౌరసరఫరాల శాఖ కమిషనర్' దృష్టికి కూడా ఈ అంశాన్ని వెళ్లకుండా తొక్కిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం . అంతటితో ఆగకుండా, తప్పు చేసిన అరవింద్‌ను ఏడాది తిరగకముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై విభాగంలో మళ్లీ టెక్నికల్ అసిస్టెంట్ (టి.ఎ)గా నియమిస్తూ తెరవెనుక కథ నడిపించారు.

​నిరుపయోగంగా తనిఖీలు.. విస్తుపోతున్న యంత్రాంగం!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో అక్రమాలను అడ్డుకునేందుకు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తుంటే.. హెడ్ ఆఫీసులోని కొందరు అధికారులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. 'కలెక్టర్ నివేదికలకే' విలువ లేకపోతే ఇక తనిఖీలు ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కమిషనర్ కళ్లు గప్పి ఇంతటి అక్రమ పోస్టింగుకు కారణమైన ఆ ‘కీలక’ అధికారిపై, సదరు 'టి.ఎ' పై ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.
🏠 Home