🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 07 July 2026, 09:35 PM Posted by: MANA VISHWAM

పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు: సీఎం రేవంత్ రెడ్డి

నాచారంలో సరికొత్త 'బాలామృతం' ప్లాంట్‌ ప్రారంభం

​ విద్యారంగంపై ఏటా రూ. 27 వేల కోట్ల పెట్టుబడి

​2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

​హైదరాబాద్ జులై 7 (మన విశ్వం): ఈనాటి పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే ఆరోగ్యవంతమైన తెలంగాణ, ప్రయోజకులైన దేశ పౌరులు ఎదుగుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన 'బాలామృతం' ప్లాంట్‌ను మంత్రి సీతక్క, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఉత్పత్తి, ప్యాకింగ్ యూనిట్లను పరిశీలించి, మొక్కను నాటారు.
​ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నారు. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు 6 ఏళ్లు వచ్చే వరకు ఉచిత పోషకాహారం అందించడానికే ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. నాడు ఇందిరాగాంధీ గారు మహబూబ్‌నగర్‌లో ప్రారంభించిన ఈ సంస్థ, నేడు 21 ఎకరాల్లో విస్తరించి తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 4-5 రాష్ట్రాలకు పౌష్టికాహారం అందించే సామర్థ్యం సాధించిందని కొనియాడారు.


​విద్యకు పెద్దపీట.. సంక్షేమంలో మహిళలకే అగ్రతాంబూలం


​ గతంలో లేని విధంగా ప్రభుత్వ బడుల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నాం. విద్యపై ఏటా ఖర్చు చేసే రూ. 27వేల కోట్లను భవిష్యత్తుపై పెట్టే 'పెట్టుబడి'గా భావిస్తున్నాం.


​మహిళల పేరిటే పథకాలు

ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాల రుణాలు, 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, అద్దెకు 1000 ఆర్టీసీ బస్సులు, శిల్పారామం వద్ద 3.5 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు అన్నీ ఆడబిడ్డల కోసమే తెచ్చాం.


​పేదలకు ఇండ్లు, మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యం

హైదరాబాద్‌లో భూముల ధరలు వజ్రాలకంటే ఎక్కువగా ఉన్నా, నిరుపేదల కోసం లక్ష ఇండ్లు కట్టాలని నిర్ణయించాం.​రాబోయే 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో, వారు వ్యాపార రంగంలో రాణించేలా అన్ని ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
🏠 Home