జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని మరిన్ని హంగులతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బొగత జలపాతం అభివృద్ధి, ఇందిరా మహిళా శక్తి ఆహార కేంద్రం నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జలపాతాన్ని సందర్శించే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించేలా తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. పర్యాటకులకు స్థానిక సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో 'ఇందిరా మహిళా శక్తి ఆహార కేంద్రాన్ని' ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రకృతి అందాలను కాపాడుతూ పర్యావరణహిత చర్యలతో జలపాతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.