🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 July 2026, 09:25 AM Posted by: MANA VISHWAM

కమిషనర్‌కు తెలుసా.. కాపాడేస్తున్నారా?

కలెక్టర్ నివేదిక పక్కనబెట్టి.. అవినీతి 'టి.ఎ.'కు మళ్లీ పోస్టింగ్!

​పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో 'కీలక' అధికారి చక్రం!


అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఈ విషయం తెలుసా? లేక నివేదికను మధ్యలోనే నొక్కేశారా?

కలెక్టర్ల ఉత్తర్వులకే దిక్కు లేకపోతే క్షేత్రస్థాయిలో ఇక వ్యవస్థ ఎవరి కంట్రోల్‌లో ఉన్నట్లు?


​వరంగల్ ప్రతినిధి, జులై 7(మన విశ్వం): పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం కొంతమంది టి ఏ ల వల్ల అభాసుపాలవుంతోంది. కాసులకు కక్కుర్తిపడి, కొంతమంది మిల్లర్ లు తెచ్చే నాణ్యత లేని, పుచ్చు పట్టిన, రంగు మారిన బియ్యాన్ని గోదాముల్లోకి అనుమతిస్తున్నారు.సరిగ్గా ఇదే రీతిలో గతేడాది వరంగల్ జిల్లాలో కలెక్టర్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయి, సరెండర్ అయిన ఓ టెక్నికల్ అసిస్టెంట్ (టి.ఎ.) వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖలో పెను సంచలనంగా మారింది. అదనపు కలెక్టర్ స్థాయి అధికారి సదరు టి.ఏ పై క్రమశిక్షణా చర్యల కోసం పంపిన నివేదిక.. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఓ ‘కీలక’ అధికారి అండదండలతో మాయమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసి ఏడాది తిరక్కుండానే సదరు 'కిలాడీ' ఉద్యోగి పక్కజిల్లా అయినటువంటి భూపాలపల్లి లో మళ్లీ పోస్టింగ్ దక్కించుకోవడం వెనుక పెద్ద నెట్‌వర్కే నడిచినట్లు తెలుస్తోంది.


​ఆకస్మిక తనిఖీ.. గుట్టురట్టు!

​గత ఏడాది వరంగల్ జిల్లాలోని చలపర్తి ‘ఎస్.డబ్ల్యూ.సి’ (SWC) గోదాముకు రాధాకృష్ణ, గోపీకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్ సంస్థలు సరఫరా చేసిన 10శాతం సన్నబియ్యం నిల్వలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. కనీస నాణ్యత లేని, పుచ్చుపట్టిన బియ్యాన్ని గోదాముల్లోకి యథేచ్ఛగా అనుమతిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన వరంగల్ జిల్లా కలెక్టర్, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ (QC) మేనేజర్, దుగ్గొండి తహసీల్దార్, నర్సంపేట ఆర్.డీ.ఓలతో కూడిన ఉన్నతాధికారుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగి 11 బియ్యం నమూనాలను క్షుణ్ణంగా పరీక్షించింది.


​మచ్చు చూస్తే.. అంతా మోసమే!

​ఈ తనిఖీల్లో ల్యాబ్ నివేదికలు చూసి అధికారులే షాక్‌కు గురయ్యారు. ఏసికే (ACK) నంబర్లు 10418, 11265, 9061 ల కింద సేకరించిన బియ్యంలో దెబ్బతిన్న గింజలు, రంగు మారిన గింజలు ప్రభుత్వం నిర్దేశించిన రిజెక్షన్ పరిమితిని మించి ఉన్నట్లు తేలింది. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై, లాభాల కోసం నాసిరకం బియ్యాన్ని పాస్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, సదరు టెక్నికల్ అసిస్టెంట్(టి ఏ) డి. అరవింద్‌పై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వరంగల్ అదనపు కలెక్టర్ కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ వీసీ & మేనేజింగ్ డైరెక్టర్‌కు పూర్తి ఆధారాలతో ఫైలు పంపారు. నిబంధనల ప్రకారం అప్పటి వరంగల్ జిల్లా మేనేజర్ ఆ 'టి.ఎ.'ను హెడ్ ఆఫీస్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


​కమిషనర్‌కు తెలవకుండానే కథ నడిపారా?

​జిల్లా అత్యున్నత అధికార యంత్రాంగం అవినీతిని ఆధారాలతో సహా నిరూపించి యాక్షన్ కోసం ఫైలు పంపితే, దానికి కేంద్ర కార్యాలయంలోని ఓ ‘సరికొత్త’ పెద్ద దిక్కు రక్షణ కవచంలా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ల లేఖలకే దిక్కు లేకపోతే ఇక క్షేత్రస్థాయిలో నిజాయితీగా పని చేసే అధికారులకు రక్షణ ఎక్కడని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. పౌరసరఫరాల శాఖలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తున్న సివిల్ సప్లై కమిషనర్ దృష్టికి ఈ వ్యవహారం అసలు వెళ్లిందా? లేదా సదరు కీలక అధికారే ఫైలును గాల్లో కలిపేశారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.


​పాపం పండకముందే.. మళ్లీ ‘పీఠం’!

​శాఖాపరమైన చర్యలకు గురికావాల్సిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి 'టి.ఎ.' అరవింద్ ఏడాది తిరగకముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పోస్టింగ్ సాధించడం పౌరసరఫరాల వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కేంద్ర కార్యాలయంలోని ఆ కీలక అధికారి ఆశీస్సులు ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైందని తోటి ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ ఈ బాగోతం కనుక కమిషనర్ టేబుల్ పైకి వెళ్తే సదరు 'టి.ఎ.'తో పాటు, అతడిని వెనకేసుకొస్తున్న సదరు ‘కీలక ’ అధికారికి పై కుడా చర్యలు ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి!
🏠 Home