🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 09 July 2026, 10:17 PM Posted by: MANA VISHWAM

గిరిజన విద్యార్థినులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

గిరిజన విద్యార్థినులు విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆయన సందర్శించారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ సీతక్కలతో కలిసి విద్యాసంస్థలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి గృహాలను గవర్నర్ పరిశీలించారు. గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య, వసతి అందిస్తున్న తీరుపై అధికారులను అభినందించారు.
​అనంతరం విద్యార్థినులతో ముచ్చటించిన గవర్నర్.. విద్యను జీవితంలో అత్యంత విలువైన ఆయుధంగా భావించాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఆదర్శంగా నిలవాలన్నారు. పరీక్షల్లో మార్కులతో పాటు విలువలతో కూడిన విద్య, నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని ఆకాంక్షించారు.
​ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలపగా.. గిరిజన బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన విద్యార్థినుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
🏠 Home