🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 10 July 2026, 11:42 AM Posted by: MANA VISHWAM

​కాంగ్రెస్ పని ఖతం.. సర్వేల్లోనూ అదే నిజం!

సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టం

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 78 సీట్లతో బీఆర్ఎస్ పీఠం: కేటీఆర్

హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు, దొంగ ఓట్లపై డేగ కన్ను వేయాలి

బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ నేతల ప్రత్యేక సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశా నిర్దేశం


​తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, ఆ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ పచ్చి నిజం తేలిపోయిందని ఆయన వెల్లడించారు. గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జ్‌ల ప్రత్యేక సమావేశంలో కేటీఆర్ పాల్గొని, పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.


​సొంత సర్వే చూసే సీఎం అడ్డగోలు మాటలు!


​పరిపాలనా వైఫల్యాలు, ఇచ్చిన గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. సగం పరిపాలన ముగిసేసరికే సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయన్నారు.
​"రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాల ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న విస్తృత సర్వేలోనూ ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) సుమారు 78 సీట్లతో ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేలింది. ప్రజలు మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఈ సర్వేల ఫలితాలు చూసి తట్టుకోలేకనే, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గత వారం రోజులుగా ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నుంచి రైతుబంధు వరకు అబద్ధాలను ప్రచారం చేస్తూ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు." అని కేటీఆర్ మండిపడ్డారు.

​కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జారుడు బండపై నిలబడిందని, ఇక అది పుంజుకునే అవకాశం లేదన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా స్పష్టంగా బీఆర్ఎస్‌ను కోరుకుంటున్నారని, బీజేపీ లాంటి పార్టీలకు అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


'​ఎస్ఐఆర్' కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి


​హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్ ) కార్యక్రమంపై పార్టీ నేతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, బూత్ లెవెల్ ఆఫీసర్లకు (బిఎల్ఓలకు) సరైన శిక్షణ, వసతులు కల్పించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫీడ్‌బ్యాక్ వస్తోందన్నారు.
'ఒక వ్యక్తికి ఒకే ఓటు' అనే రాజ్యాంగ స్ఫూర్తితో దొంగ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో భారీగా బయటపడిన డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఇతర ప్రాంతాల వారిని ఓటర్లుగా చేర్చడం లేదా డబుల్ ఓట్లు నమోదు చేయించే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారుల ఓట్లు అన్యాయంగా తొలగించబడకుండా బూత్ లెవెల్ అసిస్టెంట్లు (బిఎల్ఏ ) గట్టిగా నిలబడాలి.
నగరంలోని స్థానిక ఎమ్మెల్యేలు మరింత వేగంగా కదలాలి. క్షేత్రస్థాయిలో సమస్యలను, ప్రజా ఫీడ్‌బ్యాక్‌ను పార్టీ తరఫున ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో నగరానికి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
🏠 Home