🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 12 July 2026, 09:03 AM Posted by: MANA VISHWAM

​బద్నాం చేసేందుకే 'కిలాడీ కమిటీ'..

కేసీఆర్ తోపాటు కేటీఆర్, హరీశ్‌, ఈటల సభ్యులు : సీఎం రేవంత్ రెడ్డి

​కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ మునిగింది

​హరీశ్ రావు స్క్రిప్ట్ ప్రకారమే ఈటల మాటలు

అమెరికా లో చదువుకున్న కేటీఆర్ కు ఎత్తిపోతల సూత్రం కూడా తెలియదా

​నీటి నిల్వ సాధ్యం కాదు.. నిపుణుల కమిటీతోనే పునరుద్ధన


​తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే ధ్యేయంగా రాష్ట్రంలో ఒక "కిలాడీ కమిటీ " ఏర్పాటైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కమిటీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా సభ్యుడిగా చేరారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించారు.


​'ఎన్‌డీఎస్‌ఏ' ఆదేశాలను బీఆర్‌ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు

​కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఎలాంటి నీటిని నిల్వ చేయవద్దని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డిఎస్ఏ ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.​"కళ్ల ముందు నీరు పారుతున్నంత మాత్రాన ఎత్తిపోసే అవకాశం ఉంటే, అసలు భారీ బ్యారేజీలు నిర్మించాల్సిన అవసరం ఏముంది? పారుతున్న నీటిని నిల్వ చేసి, ఎత్తిపోయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశం. కన్నెపల్లి వద్ద 93.5 మీటర్ల ఎత్తులో నీటిని నిలిపితేనే ఎత్తిపోతలు సాధ్యమవుతాయి తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ నీటిని ఎత్తిపోయడం అసాధ్యం" అని సీఎం స్పష్టం చేశారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం ఈ ఎత్తిపోతల సూత్రం కూడా తెలియదా అని ఆయన ప్రశ్నించారు.


​ఈటల రాజేందర్‌పై సీఎం అసంతృప్తి

​బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉండేదని, కానీ కాళేశ్వరం విషయంలో ఆయన చేసిన అవాస్తవ వ్యాఖ్యల వల్ల ఆ గౌరవాన్ని కోల్పోయారని అన్నారు. హరీశ్ రావు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఈటల మాట్లాడారని, బీజేపీ ఎంపీగా ఉంటూ బీఆర్‌ఎస్ తప్పులను వెనకేసుకురావడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు.


​నాటి నిర్లక్ష్యమే నేటి మేడిగడ్డ కుప్పకూతకు కారణం


​మేడిగడ్డ బ్యారేజీలో తీవ్ర లోపాలు ఉన్నాయంటూ ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలలకే నాటి ఈఈ రమణారెడ్డి లేఖ రాసిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ లేఖను పట్టించుకోకపోవడం వల్లే నేడు మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలింది.ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ రంగాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎస్‌ఏ ప్రాథమిక, తుది నివేదికల్లో తేల్చి చెప్పింది.2022 జులైలో వరదలకు మునిగిపోయిన కన్నెపల్లి పంప్‌హౌస్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు, వినియోగంలోకి రాలేదు.


​నిపుణుల కమిటీ ద్వారానే పునరుద్ధరణ


​కేసీఆర్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌డీఎస్‌ఏ ఈ లోపాలపై నివేదిక ఇచ్చిందని సీఎం స్పష్టం చేశారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే మేధావుల మాటలను గానీ, ఇలాంటి "కిలాడీ కమిటీల" రాజకీయ సూచనలను గానీ పట్టించుకోవద్దని, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్లాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించిందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను అనుసరించి, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే బ్యారేజీల పునరుద్ధరణ పనులను చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
🏠 Home