🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 16 July 2026, 10:01 PM Posted by: MANA VISHWAM

టీజీ20 విజేతలకు సీఎం అభినందనలు

తెలంగాణలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన తొలి టీజీ20 క్రికెట్ లీగ్ (సీజన్-1) లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన సీఎం వారికి నగదు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో క్రీడలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తున్నామని, ఇప్పటికే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్‌ను మరోసారి ప్రధాన వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు టీజీ20 లీగ్ మంచి అవకాశంగా మారిందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో దేశానికి కీర్తి తీసుకొచ్చే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలంటే లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత, క్రమశిక్షణ, అంకితభావం అవసరమని క్రీడాకారులకు సీఎం సూచించారు. కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home