🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 17 July 2026, 11:05 PM Posted by: MANA VISHWAM

దేవాదాయ శాఖలో చారిత్రక నియామకాలు

తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టారు. వివిధ దేవాలయాల్లో సేవలందించేందుకు ఎంపికైన 191 మంది మతపరమైన ఉద్యోగులకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. పురోహితులు, పరిచారకులు, వేదపండితులు, వాహన పూజ పురోహితులు, సహాయ వంట సిబ్బందితో పాటు డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాల అభ్యర్థులు ఈ ఉత్తర్వులు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు స్వరాష్ట్ర చరిత్రలో దేవాదాయ శాఖలో ఇంతపెద్ద ఎత్తున మతపరమైన పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


​సేవను పవిత్ర బాధ్యతగా భావించాలి

​ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దేవాలయ సేవను కేవలం ఉద్యోగంగా కాకుండా, భగవంతుని సేవ చేసే ఒక పవిత్రమైన బాధ్యతగా గుర్తించాలని నూతన ఉద్యోగులకు సూచించారు.
​"భక్తసేవే భగవత్సేవ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి. భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే మన లక్ష్యం కావాలి. అర్చకులు, వేదపండితులు, పరిచారకులు, వాయిద్య కళాకారులు, వంట సిబ్బంది సేవలే దేవాలయాల ఆధ్యాత్మిక వైభవానికి మూలస్తంభాలు."
— కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి

​దేవాలయాల బలోపేతానికి చర్యలు

​దేవాదాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ద్వారా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు ఇకపై మరింత క్రమబద్ధంగా సాగుతాయన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త ప్రధాన ఆలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే దేవాలయ ఉద్యోగులకు అవార్డులను కూడా ప్రదానం చేస్తామన్నారు.


​త్వరలో గ్రేడ్‌-3 ఈఓల పదోన్నతులు

​అధికారుల సమిష్టి కృషి వల్లే ఈ భారీ నియామకాలు సాధ్యమయ్యాయని మంత్రి కొనియాడారు. ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధి ట్రస్ట్‌ ద్వారా మరిన్ని ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కార్యనిర్వాహక అధికారుల (ఈఓ) పదోన్నతులు పూర్తి చేశామని, త్వరలోనే గ్రేడ్‌-3 ఈఓల పదోన్నతుల ప్రక్రియను కూడా చేపడతామని వెల్లడించారు.


​రాష్ట్రవ్యాప్తంగా వరుణయాగాలు

​రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నందున, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో త్వరలోనే 'వరుణయాగాలు' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు చేయించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో దేవాలయాల అభివృద్ధి, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
​ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్‌, శాఖ సంచాలకుడు హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి, దేవాలయ పరిపాలన సంస్థ సంచాలకుడు విజయ రాఘవాచార్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తమకు భగవంతుని సేవ చేసుకునే భాగ్యం దక్కిందంటూ నియామక పత్రాలు అందుకున్న పలువురు అభ్యర్థులు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు
🏠 Home