🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 August 2026, 05:44 PM Posted by: MANA VISHWAM

ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు... తెలంగాణకు దక్కిందేమిటి?

జయశంకర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్న కేటీఆర్

32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం.. ప్రతి 13 రోజులకు ఒకసారి ఎందుకు?

తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయమంటే ప్రభుత్వం ఎందుకు మౌనం?

జయశంకర్, విద్యాసాగర్‌రావును మరిచిన సీఎం.. ఇదేనా తెలంగాణ గౌరవం?

తెలంగాణ బ్యూరో , ఆగస్టు 6 (మన విశ్వం): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఢిల్లీ గులామీ నుంచి విముక్తి చేసి స్వీయ రాజకీయ అస్తిత్వంతో నిలబెట్టాలన్నదే జయశంకర్ ఆశయమని, ప్రస్తుతం ఆ ఆశయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేవలం 32 నెలల పాలనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, అంటే ప్రతి 13 రోజులకు ఒకసారి రాజధాని చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. "తెలంగాణ హక్కుల కోసం పోతున్నాడో... ఢిల్లీ పెద్దల వద్ద యాచిస్తున్నాడో... లేక వారికి ఏమిచ్చి వస్తున్నాడో ప్రజలకు అర్థం కావడం లేదు" అంటూ విమర్శించారు. కేసీఆర్ మాదిరిగా కేంద్రం ముందు తలవంచకుండా తెలంగాణ హక్కుల కోసం సింహంలా నిలబడటమే జయశంకర్ బోధించిన మార్గమని అన్నారు.


'ఏడు ప్రాజెక్టులు రద్దు చేయమంటే ఎందుకు మాట్లాడటం లేదు?'

తెలంగాణకు సంబంధించిన ఏడు సాగునీటి ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలోని జాతీయ పార్టీల చేతుల్లో అధికారం ఉంటే వారు ఆడించినట్లు ఆడాల్సిందేనని, తెలంగాణ కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ఉండేదే కాదన్నారు. లోక్‌సభలో తెలంగాణ విభజనను పాకిస్థాన్‌తో పోల్చినప్పుడు ఒక్క కాంగ్రెస్ లేదా బీజేపీ ఎంపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకత్వం ఉంటే అలాంటి వ్యాఖ్యలను అక్కడికక్కడే తిప్పికొట్టేదని అన్నారు.


'జయశంకర్ ఎక్కడ.. విద్యాసాగర్‌రావు ఎక్కడ?'


తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. జైపాల్ రెడ్డి, కే. కేశవరావులను మేధావులుగా పేర్కొంటూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, నీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్‌రావు పేర్లు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల పేర్లు చెప్పకపోయినా, ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఉన్న ప్రొఫెసర్ కోదండరాం పేరైనా చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ స్వాభిమానం, రాష్ట్ర హక్కులు, రాజకీయ స్వయం ప్రతిపత్తి కోసం జయశంకర్ చూపిన మార్గంలోనే బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
🏠 Home