🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 August 2026, 08:49 AM Posted by: MANA VISHWAM

క్యూర్‌లో ఇందిరమ్మ ‘టవర్స్‌’కు నేడు శ్రీకారం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. CURE పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించనున్నారు.
CURE పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నగరంలో భూమి కొరతను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను సమర్థంగా వినియోగిస్తూ బహుళ అంతస్తుల భవనాల రూపంలో ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది.


తొలిదశలో 7,340 ఫ్లాట్లు

లక్ష ఇళ్ల లక్ష్యంలో భాగంగా తొలిదశలో 18 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 7,340 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన స్థలాల గుర్తింపు, నిర్మాణ ప్రణాళిక తదితర అంశాలపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. దశలవారీగా మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్మాణాలను విస్తరించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా నగర పేదలకూ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఒకేచోట పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నివాస వసతి కల్పించేలా ‘టవర్స్‌’ తరహాలో నిర్మాణాలు చేపట్టనుంది. కేపీహెచ్‌బీలో సీఎం భూమిపూజతో ఈ బృహత్తర గృహ నిర్మాణ కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టనుంది.
🏠 Home