🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 August 2026, 04:42 PM Posted by: MANA VISHWAM

బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు

బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు అందించనుంది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మంది మహిళలకు ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున వీటిని అందించనుంది. ఒక్కో మిషన్‌ విలువ రూ.12 వేలు కాగా.. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వందశాతం రాయితీతో ఇవ్వనుంది.
ఈ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ మహిళలకు స్థిరమైన ఉపాధి మార్గం చూపడంతోపాటు కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కల్పించడమే పథకం ఉద్దేశమన్నారు. మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే పరిమితం చేయకుండా స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.


15 నుంచి దరఖాస్తులు

కుట్టు మిషన్ల కోసం అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ మహిళలతోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, దివ్యాంగులు, ఇప్పటికే కుట్టు పనిలో అనుభవం ఉన్న వారికి ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.


మిషన్‌తోపాటు శిక్షణ

కుట్టు మిషన్‌ అందించడంతోనే సరిపెట్టకుండా వాటి వినియోగం, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అవసరమైన శిక్షణనూ అందిస్తామని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మహిళలు ఇంటి వద్ద నుంచే పని చేసుకుంటూ ఆదాయం సమకూర్చుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. తొలి దశలో 1.19 లక్షల మందికి ప్రయోజనం కల్పిస్తున్నామని, భవిష్యత్తులో పథకాన్ని మరింత విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఉచిత బస్సు ప్రయాణంతోపాటు వివిధ స్వయం ఉపాధి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. కుట్టు మిషన్ల పంపిణీతో బీసీ మహిళలకు ఆదాయ మార్గాలను మరింత చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 14న మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ, 18న సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
🏠 Home