🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 August 2026, 07:33 PM Posted by: MANA VISHWAM

ప్రజల చెంతకే ‘ప్రజావాణి’

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర కేంద్రాల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మండల స్థాయిలోనే పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మండల ప్రజావాణి’ కి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్న 560 మంది మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు (ఎంపీడీవోలు) గురువారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి శిక్షణ ఇచ్చారు.
మండల ప్రజావాణికి ఎంపీడీవోలను నోడల్‌ అధికారులుగా నియమించారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ మొదలు.. వాటి నమోదు, సంబంధిత శాఖలకు పంపడం, పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించడం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపేలా అనుసరించాల్సిన విధానాలను నిపుణులు వివరించారు.


‘ప్రజలే యజమానులు’

శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజలే యజమానులు.. అధికారులు ప్రజాసేవకులు’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యతో కార్యాలయానికి వచ్చే వ్యక్తిని ఓపికగా విని, వినతిపత్రం తీసుకోవడంతోనే బాధ్యత పూర్తయిందని భావించొద్దన్నారు. సమస్యకు పరిష్కారం లభించే వరకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రజావాణి భరోసాగా నిలవాలన్నారు. చిన్న సమస్యలకూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, మండల స్థాయిలో పరిష్కరించగలిగే వాటిని అక్కడే తేల్చాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా నోడల్‌ అధికారులు పనిచేయాలని కోరారు.


75 శాతం వినతులకు పరిష్కారం

రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ప్రజావాణికి వచ్చిన సమస్యల్లో ఇప్పటివరకు 75 శాతం పరిష్కరించినట్లు చిన్నారెడ్డి వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని మండల స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ఒక సమస్య పరిష్కారానికి రెండు, మూడు శాఖలతో సంబంధం ఉంటే వాటి మధ్య సమన్వయం చేసే బాధ్యతను నోడల్‌ అధికారులు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పెరిగేలా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్ర నోడల్‌ అధికారి కె.విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. దరఖాస్తులు తీసుకుని పక్కన పెట్టడం ప్రజావాణి ఉద్దేశం కాదని, పరిష్కారం వరకు వాటిని అనుసరించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజావాణి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఓఎస్డీ వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులతో ప్రజావాణికి వచ్చే వారికి అధికారులు భరోసా కల్పించాలని సూచించారు.
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ మాట్లాడుతూ.. సమస్యతో వచ్చిన వారి మాటను ఓపికగా వినడమే పరిష్కారంలో తొలి అడుగని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత వేగంగా చర్యలు చేపట్టాలని చెప్పారు.


ఫిర్యాదు నుంచి పరిష్కారం వరకు..

మండల ప్రజావాణి నిర్వహణ, వినతుల నమోదు, వాటిని సంబంధిత శాఖలకు పంపడం, పరిష్కార పురోగతిని పర్యవేక్షించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం తదితర అంశాలపై నిపుణులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ల ద్వారా ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమంలో ప్రణాళిక శాఖ డైరెక్టర్‌ షేక్‌ మీరా, సీఎం ప్రజావాణి ఏసీపీ ఉమేందర్‌, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతినిధి సుశీల తదితరులు పాల్గొన్నారు.
🏠 Home