🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 August 2026, 07:57 PM Posted by: MANA VISHWAM

పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కరుణాకర్

17 ఓట్ల ఆధిక్యంతో విజయం

ఉపాధ్యక్షులుగా సతీష్, శరత్‌కుమార్

ప్రధాన కార్యదర్శిగా వీరభద్రరావు

ఓటు హక్కు వినియోగించుకున్న 110 మంది అధికారులు

వరంగల్, ఆగస్టు 13(మన విశ్వం) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం కమిషనరేట్ కార్యాలయంలోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో జరిగాయి. సంఘం నూతన అధ్యక్షుడిగా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కొండా కరుణాకర్ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ టి.బాబుపై ఆయన 17 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు సదయ్య, నాగయ్య పర్యవేక్షించారు. వివిధ హోదాల్లోని 110 మంది పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పోలింగ్ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారి, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులకు సూచనలు చేశారు.


కార్యవర్గం ఇదే..

సంఘం ఉపాధ్యక్షులుగా బి.సతీష్ (ఆర్‌ఐ), బి.శరత్‌కుమార్ (ఆర్‌ఎస్‌ఐ), ప్రధాన కార్యదర్శిగా ఇ.వీరభద్రరావు (దామెర ఎస్‌ఐ), సంయుక్త కార్యదర్శిగా టి.నరేష్ (కాజీపేట కానిస్టేబుల్), కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్.ప్రవీణ్‌కుమార్ (ఏఆర్ కానిస్టేబుల్), కోశాధికారిగా బి.నరేష్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు.

కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.తులసి (మహిళా కానిస్టేబుల్, కాజీపేట), సీహెచ్ మహేందర్ యాదవ్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎ.రమేష్ (ఏఆర్ కానిస్టేబుల్), ఎన్.ప్రవీణ్ (సుబేదారి కానిస్టేబుల్), ఎండీ తాజుద్దీన్ (హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్), పి.సర్వేశ్ (పాలకుర్తి కానిస్టేబుల్) ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కొండా కరుణాకర్‌తో పాటు కార్యవర్గ సభ్యులను పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందించారు.
🏠 Home