🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 15 August 2026, 05:54 PM Posted by: MANA VISHWAM

‘శవాలపై అధికారం’ కోసం అఘోర పూజలా?

రాష్ట్రం నాశనం కావాలని పొరుగు రాష్ట్రాల్లో చేతబడులా?

పదేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా చేయిస్తారా?: సీఎం రేవంత్‌రెడ్డి

‘మాపై చేస్తే ఎదుర్కొంటాం.. ప్రజలపై చేయడమేంటి?’

‘అగ్గిపెట్టేరావు.. అఘోరరావుల మాయలో పడొద్దు’

నిరుద్యోగులకు ఆరు నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు

సంగారెడ్డి సభలో విపక్షంపై సీఎం తీవ్ర విమర్శలు


రాజకీయ ప్రత్యర్థులను ఓడించేందుకు విమర్శలు, వ్యూహాలు సహజమే.. కానీ రాష్ట్రంలో కరువు రావాలని, ప్రజలు కష్టాల్లో పడాలని, ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటూ అఘోరా పూజలు చేయించడం ఏం రాజకీయం? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విపక్షంపై నిప్పులు చెరిగారు. ‘‘మాపై చేతబడులు చేస్తే ఎదుర్కొంటాం.. తెలంగాణ ప్రజలపై ఎందుకీ కక్ష?’’ అని నిలదీశారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఇలాంటి పూజలు చేయించారని ఆరోపిస్తూ.. ‘‘శవాలపై అధికారం కోసం రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటారా?’’ అని ధ్వజమెత్తారు. యువతను రెచ్చగొట్టే 'అగ్గిపెట్టెరావు.. అఘోర రావుల ' మాయలో పడొద్దని హెచ్చరిస్తూనే.. నిరుద్యోగులకు ఆరు నెలలకోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సంగారెడ్డి సభ వేదికగా విపక్షంపై సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.

శివమొగ్గకు వెళ్లింది ఎందుకు దాచారు?

సామాజిక మాధ్యమాల్లో ప్రతి విషయాన్నీ ప్రచారం చేసుకునే నేతలు.. పొరుగు రాష్ట్రంలోని ఆలయానికి వెళ్లిన విషయాన్ని మాత్రం ఎందుకు వెల్లడించలేదని సీఎం ప్రశ్నించారు. ‘‘అడుగు తీసి అడుగు వేస్తే పోస్టులు పెట్టేవారు.. శివమొగ్గకు వెళ్లినప్పుడు మాత్రం ఎందుకు పెట్టలేదు? ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు నోటీసులు పంపిస్తున్నారు. అక్కడికి ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.
తమ ప్రభుత్వ సంకల్పం మంచిదని, అందుకే ప్రకృతి, దేవుడి సహకారం లభిస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.


‘అగ్గిపెట్టేరావు.. అఘోరరావులతో జాగ్రత్త’

యువత, నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ‘‘అగ్గిపెట్టేరావు.. అఘోరరావులు మీ దగ్గరకు వస్తారు. వారి మాటలు నమ్మొద్దు. వాళ్లకు అగ్గిపెట్టెలు దొరకవు కానీ.. అమాయక యువతను బలి చేసేందుకు మాత్రం వెనుకాడరు’’ అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును దెబ్బతీసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


‘ఉద్యోగాల బాధ్యత మాది’

నిరుద్యోగ యువత ఎవరి ప్రలోభాలకు గురికావద్దని సీఎం కోరారు. క్రమం తప్పకుండా ఉద్యోగ నియామక ప్రకటనలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ‘‘ఆరు నెలలకోసారి నోటిఫికేషన్లు వస్తాయి. యువత చదువుపై దృష్టిపెట్టాలి. మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మాదే. కొందరు వచ్చి మాయమాటలు చెబుతారు. వాటిని నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు’’ అని సూచించారు.


‘ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు’

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కనిపించేలా ప్రభుత్వం ముందుకెళ్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘గుడి, బడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ.. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు మాత్రం ఉండదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల రాజ్యం’’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులకు ఉద్యోగాలు దక్కాయని.. సాధారణ యువతకు మాత్రం అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు.


‘మూడు పాలనలను పోల్చి చూడండి’
సంక్షోభ పరిస్థితులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని సీఎం చెప్పారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణను తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ‘‘కేంద్రంలో 12 ఏళ్ల భాజపా పాలన, రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్‌ పాలన, రెండేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును ప్రజలు పోల్చి చూడాలి. ఎవరు ఏం చేశారో అప్పుడు స్పష్టమవుతుంది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
🏠 Home