🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 17 August 2026, 11:09 PM Posted by: MANA VISHWAM

ఒకటే యూనిఫాం.. వేర్వేరు న్యాయాలా?

విధుల్లో ప్రాణాలు కోల్పోయిన బీట్‌ అధికారి నవీన్‌ కుటుంబాన్ని ఆదుకోరా?

పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. అటవీ ఉద్యోగికి ఎందుకు లేదు?

మంత్రి కోరినా అధికార లాంఛనాలు దక్కకపోవడమేంటి?

ప్రభుత్వ తీరుపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నల వర్షం

నవీన్‌ కుటుంబానికి తక్షణ సాయం ప్రకటించాలని డిమాండ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 17 (మన విశ్వం): ‘‘యూనిఫాం ఒక్కటే.. విధి నిర్వహణలో ప్రాణత్యాగమూ ఒక్కటే.. మరి పరిహారం, గౌరవం విషయంలో న్యాయం ఎందుకు వేర్వేరు?’’ అంటూ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ బీట్‌ అధికారి బానోత్‌ నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామ శివారులోని అడవిలో ఈ నెల 11న వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి బీట్‌ అధికారి బానోత్‌ నవీన్‌ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా అటవీ అధికారులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారని తెలిపారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సైతం నవీన్‌ మృతికి సంతాపం తెలిపారని గుర్తుచేశారు.


మంత్రి కోరినా.. లాంఛనాలేవీ?

నవీన్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ‘‘మంత్రి విజ్ఞప్తినే పట్టించుకోలేదా? కిందిస్థాయి అటవీ ఉద్యోగులంటే చిన్నచూపా? అటవీశాఖపై ఎందుకీ సవతితల్లి ప్రేమ?’’ అని నిలదీశారు. మంత్రి అధికారికంగా కోరినప్పటికీ నవీన్‌కు అధికార లాంఛనాలు ఎందుకు దక్కలేదో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


పోలీసులకు కోటి.. నవీన్‌కు ఏది?

గతంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్లు సౌమ్య, ఎంపల్లి ప్రమోద్‌కుమార్‌ కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిందని ప్రవీణ్‌కుమార్‌ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చెక్కులు అందజేశారని పేర్కొన్నారు.
‘‘బానోత్‌ నవీన్‌ చేసిన పాపమేంటి? ఆయన కూడా యూనిఫాం ధరించి రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యోగే కదా? అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే అటవీ సిబ్బందికి అదే భరోసా ఎందుకు ఉండకూడదు?’’ అని ప్రశ్నించారు. పోలీసుశాఖకు ఒక న్యాయం, అటవీశాఖకు మరో న్యాయం అమలు చేయడం వివక్ష కాదా అని నిలదీశారు.


‘కుటుంబానికి భరోసా ఇవ్వాలి’

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నవీన్‌ కుటుంబానికి ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని ఆశించినా ఎలాంటి ప్రకటన రాకపోవడం బాధాకరమని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే బీట్‌ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
నవీన్‌ కుటుంబానికి తక్షణమే తగిన ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం కల్పించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అన్ని యూనిఫాం విభాగాల ఉద్యోగుల కుటుంబాలను సమానంగా ఆదుకునే విధానం ఉండాలని కోరారు.
ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అన్యాయం జరిగినా, అక్రమ ఆదేశాలతో ఇబ్బందులకు గురైనా బీఆర్‌ఎస్‌ దృష్టికి తీసుకురావాలని ప్రవీణ్‌కుమార్‌ కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు.
🏠 Home