🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 18 August 2026, 09:54 PM Posted by: MANA VISHWAM

వృత్తికి భరోసా.. భవితకు చదువు!

‘‘గీత, చేనేత కార్మికులందరికీ పింఛన్లు: సీఎం రేవంత్‌’’

ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ

అక్టోబరు 22న పండుగ సాయన్న జయంతి అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటన

‘కులవృత్తిని గౌరవించండి.. పిల్లలను మాత్రం తప్పక చదివించండి’

హైదరాబాద్‌, ఆగస్టు 18 (మన విశ్వం): రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సాచ్యురేషన్‌ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మంగళవారం ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు గీత కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. గీత వృత్తికి భరోసా కల్పించేందుకు సాగునీటి కాలువల గట్లపై ఈత, తాటి చెట్లు నాటేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
‘‘సర్వాయి పాపన్న ఒక కులానికి చెందిన నాయకుడు కాదు.. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన మహావీరుడు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు నిలవాలి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పండుగ సాయన్న జయంతిని అక్టోబరు 22న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు.
‘‘కులవృత్తిని కొనసాగించండి.. గౌరవించండి. కానీ పిల్లలను తప్పకుండా చదివించండి. వారి తలరాతను మార్చేది చదువే’’ అని సీఎం పిలుపునిచ్చారు. విద్యార్థుల చదువుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని, సామాజిక న్యాయమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home