🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 18 August 2026, 10:35 PM Posted by: MANA VISHWAM

పర్మిషన్‌కు ‘లంచం’ ముడుపు!

భవన నిర్మాణ అనుమతి ఫైలు ముందుకు కదలాలంటే రూ.20 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ఏసీబీకి చిక్కారు. చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సంతోష్‌నగర్‌ సర్కిల్‌-25లో పనిచేస్తున్న ప్రభావతి మంగళవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్‌-1 అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భవన నిర్మాణ అనుమతి ఫైలును ప్రాసెస్‌ చేయడంతోపాటు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమెన్స్మెంట్ లెటర్ అందించేందుకు ప్రభావతి రూ.20 వేలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. దీంతో బాధితుడు అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం నగదు అందిస్తుండగా మాటువేసిన ఏసీబీ బృందం ఆమెను పట్టుకుంది. లంచంగా తీసుకున్న రూ.20 వేల నగదును ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
అధికారిక విధుల నిర్వహణలో అక్రమ ప్రయోజనం పొందేందుకు వ్యవహరించినట్లు ఏసీబీ పేర్కొంది. ప్రభావతిని నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాలతో ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు .
🏠 Home