🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 20 August 2026, 02:05 PM Posted by: MANA VISHWAM

పొంగులేటీ.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

‘‘పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డీ.. మీ అవినీతి చిట్టా మొత్తం మా వద్ద ఉంది. రూ.15 వేల కోట్ల విలువైన ఫీనిక్స్‌ భూములు, ఆస్తులు మీకు సంబంధించిన సంస్థలకు ఎలా బదిలీ అయ్యాయో చెప్పే పత్రాలతో అసెంబ్లీకి వచ్చాం. దమ్ముంటే మీరు కూడా రండి.. ప్రజల ముందే తేల్చుకుందాం’’ అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన సవాల్‌ విసిరారు.
గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకున్న ఏలేటి.. పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫీనిక్స్‌ కంపెనీ నుంచి పొంగులేటికి సంబంధించిన సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు బదిలీ అయ్యాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు.


‘పత్రాలు మావి.. సమాధానం మీదే’

‘‘మాటలు కాదు.. పత్రాలతో వచ్చాం. అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్‌లో నిలబడ్డాం. తెలంగాణ సంపదను ఎవరు దోచుకుంటున్నారో ఆధారాలతో బయటపెడతాం. పొంగులేటికి ధైర్యముంటే ఇక్కడికి వచ్చి మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’’ అని ఏలేటి డిమాండ్‌ చేశారు.
‘‘ఫీనిక్స్‌ నుంచి మీ సంబంధిత సంస్థలకు ఆస్తులు ఎలా వచ్చాయి? వాటి వెనుక జరిగిన లావాదేవీలేంటి? అన్నింటికీ ఆధారాలు మా వద్ద ఉన్నాయి. బహిరంగ చర్చకు సిద్ధమా?’’ అంటూ పొంగులేటిని నిలదీశారు.
ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌, ఎమ్మెల్సీలు కొమురయ్య, ఏవీఎన్‌ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏలేటితో కలిసి బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
ఏలేటి చేసిన రూ.15 వేల కోట్ల భూ బదలాయింపుల ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందించాల్సి ఉంది.
🏠 Home