🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 20 August 2026, 07:56 PM Posted by: MANA VISHWAM

'యమపాశాల్లా’ విద్యుత్ తీగలు..

ఒరిగిన స్తంభాలతో మండల ప్రజల ప్రాణసంకటం!

అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న గ్రామీణులు..

ప్రమాదం జరగకముందే స్పందించాలని వేడుకోలు

మల్హర్ ఆగస్టు 20 (మన విశ్వం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ రావు మండల పరిధిలో విద్యుత్ వ్యవస్థ అధ్వానంగా మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాడిచెర్ల గ్రామంలోనీ రామరావు పల్లెలో కాకుండా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ లైన్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. విరిగిపోయే స్థితికి చేరిన స్తంభాలు, నేలను తాకుతున్న హైటెన్షన్, ఎల్టీ కరెంట్ వైర్లు గ్రామీణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.​
తాడిచెర్ల తో పాటు పరిసర గ్రామాల వీధుల్లో, వ్యవసాయ బాటల్లో స్తంభాలు పక్కకు ఒరిగిపోయి ఎప్పుడు కూలుతాయో తెలియని దుస్థితి నెలకొంది. తీగలు లూజ్ అయి చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి.
​రైతులు పొలాలకు వెళ్లే దారుల్లో తీగలు కిందకు వేలాడుతుండటంతో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు తిరగడం ప్రాణాంతకంగా మారింది.
​ నిత్యం పశువులు, గొర్రెలు మేతకు వెళ్లే మార్గాల్లో తీగలు వేలాడుతుండటంతో అవి విద్యుదాఘాతానికి గురవుతాయేమోనని కాపరులు వణికిపోతున్నారు.
​ నివాసాల పైకప్పుల సమీపానికి కరెంట్ వైర్లు ఉండటంతో ఆడుకునే చిన్నారులు ఎక్కడ ప్రమాదాల బారిన పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో ఎక్కడ చూసినా పాతబడిన స్తంభాలు, వేలాడే వైర్లే దర్శనమిస్తున్నాయని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి ఈదురుగాలులకే వైర్లు ఒకదానికొకటి తాకి స్పార్కులు రావడం, తీగలు తెగిపడటం నిత్యకృత్యమైందని ప్రజలు మండిపడుతున్నారు.
​ఈ సమస్యలపై పలుమార్లు విద్యుత్ శాఖ సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినా తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఘోర ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాతే అధికారులు మేల్కొంటారా? అని మండల ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.​తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి
తాడిచర్ల లోని రామారావు పల్లెలో ఉన్న విద్యుత్ స్తంభం తో సహా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించి కొత్తవి పెట్టాలని, వేలాడుతున్న వైర్లను సరిచేసి లాగాలని ఉన్నతాధికారులను గట్టిగా కోరుతున్నారు.
🏠 Home