🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 21 August 2026, 11:27 AM Posted by: MANA VISHWAM

రెడ్డిలకో న్యాయం.. బీసీ మహిళకో న్యాయమా?

సుస్మిత మాట్లాడితే.. కొండా సురేఖకు షోకాజ్‌ ఎలా ఇస్తారు?

ఇతర నేతల ఘాటు వ్యాఖ్యలకు లేని క్రమశిక్షణ ఇప్పుడే గుర్తొచ్చిందా?

మేడారానికి దేవాదాయ మంత్రిని తీసుకెళ్లకపోవడం అవమానం కాదా?

బీసీ మహిళలపై కక్షసాధింపు మానుకోవాలి

తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్‌ ధ్వజం


‘‘రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోరు.. బీసీ మహిళ విషయంలో మాత్రం వెంటనే క్రమశిక్షణ గుర్తుకొస్తుందా? కుమార్తె మాట్లాడితే తల్లికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడమేంటి?’’ అంటూ తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్‌ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో జరుగుతున్న పరిణామాలు బీసీలను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు.
వరంగల్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్‌ నోటీసు ఇవ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించారు. పార్టీలో ఇతర నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో ఇదే తరహాలో ఎందుకు స్పందించలేదో కాంగ్రెస్‌ నాయకత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


‘సురేఖను పక్కనపెట్టడం అవమానం కాదా?’

మేడారం వంటి కీలక పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని భరత్‌ ప్రశ్నించారు. సంబంధిత శాఖ మంత్రికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆమెను అవమానించడమేనని ఆరోపించారు. బీసీ మహిళా మంత్రిని రాజకీయంగా పక్కనపెడుతున్నారనే అనుమానాలకు ఇలాంటి పరిణామాలే కారణమవుతున్నాయన్నారు.


‘సుస్మిత ఆవేదనను అర్థం చేసుకోవాలి’

కొండా మురళీధర్‌రావుకు గతంలో ఇచ్చిన మాటలను రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోలేదనే ఆవేదనతోనే సుస్మిత స్పందించారని భరత్‌ పేర్కొన్నారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆమె మాట్లాడటంలో తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా దంపతుల పాత్ర, పార్టీ కోసం వారు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు.


‘కక్షసాధింపు మానుకోండి’

బీసీ మహిళ మంత్రి అయినప్పటి నుంచి సురేఖపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని భరత్‌ ఆరోపించారు. నాయకులపై చర్యల విషయంలో అందరికీ ఒకే ప్రమాణం ఉండాలని స్పష్టం చేశారు. " బీసీలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహారిస్తే సహించేది లేదు. బీసి మహిళలపై కక్షసాధింపు, దుష్ప్రచారానికి తక్షణమే తెరదించాలి " అని డిమాండ్ చేశారు
🏠 Home