🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 21 August 2026, 04:55 PM Posted by: MANA VISHWAM

లంచమూ ‘ఫోన్‌పే’లోనే!

ఇంటి అనుమతి, నంబరు కోసం రూ.20 వేలు డిమాండ్‌

బేరం తర్వాత రూ.13 వేలకు ఒప్పందం
మరో పంచాయతీ కార్యదర్శి ఫోన్‌పే ఖాతాకు బదిలీ

ఏసీబీ వలలో లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి

మంచిర్యాల, ఆగస్టు 21(మన విశ్వం) : ఇంటి నిర్మాణానికి అనుమతి.. కొత్త ఇంటికి నంబరు కేటాయించేందుకు రూ.20 వేల లంచం డిమాండ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శి చివరకు రూ.13 వేలకు బేరం కుదుర్చుకుని ఏసీబీకి చిక్కారు. నగదు తీసుకోకుండా మరో పంచాయతీ కార్యదర్శి ఫోన్‌పే ఖాతాకు డబ్బులు బదిలీ చేయించినా.. ఏసీబీ అధికారుల వల నుంచి తప్పించుకోలేకపోయారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.వరలక్ష్మి.. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి అనుమతి ఇవ్వడంతోపాటు ఇంటి నంబరు కేటాయించేందుకు ఫిర్యాదుదారుడిని రూ.20 వేలు లంచం అడిగినట్లు ఏసీబీ తెలిపింది. బేరసారాల అనంతరం రూ.13 వేలు తీసుకునేందుకు అంగీకరించారు.
ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల పన్నారు. ఈ క్రమంలో వరలక్ష్మి నేరుగా నగదు తీసుకోకుండా మరో పంచాయతీ కార్యదర్శి లావణ్యకు చెందిన ఫోన్‌పే నంబరు ఇచ్చి రూ.13 వేలు బదిలీ చేయాలని సూచించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదుదారుడు నగదు బదిలీ చేశారు. లంచం డిమాండ్‌తోపాటు ఫోన్‌పే ద్వారా చెల్లించాలని సూచించిన విషయాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేసి ఆధారాలు సేకరించారు.
వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన అధికారులు కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
🏠 Home