🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 21 August 2026, 05:07 PM Posted by: MANA VISHWAM

ఖర్గే వద్దకు వనపర్తి పంచాయితీ!

చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు

దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే

ఇక్కడ గాంధీభవన్‌ ముట్టడికి చిన్నారెడ్డి వర్గం

మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.. ధర్నా

రెండు వర్గాల పోరుతో కాంగ్రెస్‌లో కలకలం

హైదరాబాద్‌, ఆగస్టు 21 (మన విశ్వం): వనపర్తి కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు అధిష్ఠానం గడపకు చేరాయి. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేయగా.. అదే సమయంలో హైదరాబాద్‌లో చిన్నారెడ్డి అనుచరులు గాంధీభవన్‌ను ముట్టడించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
దిల్లీ వెళ్లిన మేఘారెడ్డి ఖర్గేను కలిసి వనపర్తి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. చిన్నారెడ్డి వ్యవహారశైలిపైనా ఆయన అధిష్ఠానం దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లినట్లు తెలిసింది.
మేఘారెడ్డి ఫిర్యాదు విషయం బయటకు రావడంతో చిన్నారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. గాంధీభవన్‌ ముట్టడికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
వనపర్తిలో ఇప్పటివరకు రెండు వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు తాజాగా దిల్లీ వరకు వెళ్లడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒకవైపు ఎమ్మెల్యే నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం.. మరోవైపు మాజీ మంత్రి అనుచరులు పీసీసీ కార్యాలయం వద్దకే వచ్చి నిరసన తెలపడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
🏠 Home