🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 24 August 2026, 10:56 PM Posted by: MANA VISHWAM

రాహుల్‌.. దమ్ముంటే తెలంగాణకు రా!

విద్యార్థుల భవిష్యత్తుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్‌ విసిరారు. విద్యార్థుల సమస్యలపై ఇటీవల మాట్లాడుతున్న రాహుల్‌.. ముందుగా కాంగ్రెస్‌ పాలిత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై స్పందించాలని డిమాండ్‌ చేశారు.
‘‘రాహుల్‌ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలి. తన పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఇప్పించాలి. అప్పుడే విద్యార్థులపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యార్థులు, యువత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరుబాట పట్టారని రాంచందర్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన ప్రధాన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడిందని, లక్షల మంది విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారాయని విమర్శించారు.
విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘నేడు మోసపోయామని భావిస్తున్న విద్యార్థులు, యువతే రేపు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు’’ అని రాంచందర్‌రావు హెచ్చరించారు.
🏠 Home