రూ.30 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

పట్టాదారు పాస్‌బుక్‌ జారీకి సహకరించేందుకు లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మంచికట్ల రాహుల్‌ ఏసీబీకి చిక్కారు. భూమిని సర్వే చేసి రిజిస్ట్రేషన్‌కు నివేదిక ఇవ్వడంతో పాటు పట్టాదారు పాస్‌బుక్‌ జారీకి తొలుత రూ.50 వేలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారు కోరడంతో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో తొలి విడతగా రూ.30 వేలను బీర్‌పూర్‌లోని సిరిపురం కాలనీలో ఫిర్యాదుదారుడి నివాసంలో తీసుకుంటుండగా కరీంనగర్‌ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని రాహుల్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.