Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”!

Author MANA VISHWAM | 06 Jun 2026, 11:43 AM | HEALTH
మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”!

కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత కచ్చితత్వంతో తొలిదశ మానవ పిండాల డీఎన్‌ఏను విజయవంతంగా ఎడిట్‌ చేశారు. ఈ మైలురాయి భవిష్యత్తులో వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గుండెజబ్బులు తదితర వ్యాధులను నివారించడానికి సహాయపడవచ్చు. కానీ ఇది తమకు నచ్చిన లక్షణాలతో కూడిన పిల్లలను సృష్టించే అవకాశం గురించిన ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. ఈ పరిశోధనకు జన్యు శాస్త్రవేత్త డైటర్‌ ఎగ్లీ నాయకత్వం వహించారు. మానవ పిండాల డీఎన్‌ఏను మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ప్రజల్లో చర్చను ఈ ఫలితాలు ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

“మేము శాస్త్రీయ డాటాను అందించగలం, కానీ ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించాలో సమాజమే నిర్ణయించాలి” అని ఆయన అన్నారు. డీఎన్‌ఏ మార్పు కోసం పరిశోధకులు బేస్‌ ఎడిటింగ్‌ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించారు. డీఎన్‌ఏ పోచలను కత్తిరించే సాంప్రదాయ క్రిస్పర్‌ జీన్‌ ఎడిటింగ్‌లా కాకుండా బేస్‌ ఎడిటింగ్‌ అనేది వ్యక్తిగత జన్యు అక్షరాలలో చిన్న, కచ్చితమైన మార్పులను చేస్తుంది. మునుపటి జీన్‌ ఎడిటింగ్‌ పద్ధతుల్లో తరచుగా కనిపించే భారీ డీఎన్‌ఏ నష్టాన్ని ఈ పద్ధతి నివారించిందని పరిశోధక బృందం తెలిపింది. అయితే ముఖ్యంగా దుష్ప్రభావాలకు సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉందని డాక్టర్‌ ఎగ్లీ నొక్కి చెప్పారు. ఈ సాంకేతికత ఇంకా క్లినికల్‌ వినియోగానికి సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ఈ అధ్యయనం ఆన్‌లైన్‌లో ప్రచురితమైనది.

బేస్‌ ఎడిటింగ్‌తో కచ్చితమైన ఫలితాలు
ఈ సమస్యలను అధిగమించడానికి శాస్త్రవేత్తలు 2016లో హార్వర్డ్‌ జన్యుశాస్త్రవేత్త డేవిడ్‌ లియూ, అతని సహచరులు అభివృద్ధి చేసిన బేస్‌ ఎడిటింగ్‌ సాంకేతికత వైపు మొగ్గు చూపారు. డీఎన్‌ఏను కత్తిరించానికి బదులుగా బేస్‌ ఎడిటింగ్‌ ఒక డీఎన్‌ఏ పోచలో చిన్న కోతను సృష్టించి మ్యుటేషన్‌ను సరిచేయడానికి కణానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ పద్ధతి ఇప్పటికే మంచి ఫలితాలను చూపించింది. గత సంవత్సరం, ప్రాణాంతక జన్యు లోపంతో ఉన్న ఒక శిశువుకు నయం చేయడానికి వైద్యులు ప్రత్యేకంగా తయారు చేసిన బేస్‌ ఎడిటింగ్‌ అణువులను ఉపయోగించారు. డాక్టర్‌ ఎగ్లీ బృందం ఈ సాంకేతికతను మానవ పిండాలపై పరీక్షించాలని నిర్ణయించుకున్నది. శాస్త్రవేత్తలు రెండు జన్యువులపై దృష్టి పెట్టారు. ఒక జన్యువు పీసీఎస్‌కే9, ఇది ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. రెండవ జన్యువు హెచ్‌బీజీ. ఇది పిండంలో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో పాత్ర పోషిస్తుంది. దానం చేసిన ఫలదీకరణ గుడ్లు, రెండు కణాల పిండాలను ఉపయోగించి పరిశోధకులు బేస్‌ ఎడిటింగ్‌ అణువులను ప్రవేశపెట్టి రెండు జన్యువులను విజయవంతంగా మార్చారు. కొన్ని పిండాలలో వారు ఒకే సమయంలో రెండు జన్యువులను ఎడిట్‌ చేయగలిగారు. మునుపటి క్రిస్పర్‌ ప్రయోగాల వలె కాకుండా పరిశోధకులు ఎటువంటి పెద్ద డీఎన్‌ఏ నష్టాన్ని గమనించలేదు.

ఇవి కూడా చదవండి

క్లినికల్‌ వినియోగానికి సవాళ్లు
ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ప్రక్రియ పరిపూర్ణంగా లేదు. కొన్ని సందర్భాల్లో ఎడిటింగ్‌ అణువులు వాటి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా ఒకే పిండంలోని కొన్ని కణాలు ఎడిట్‌ కాగా మరికొన్ని మారకుండా ఉండిపోయాయి. ఈ పిండాలు శిశువులుగా అభివృద్ధి చెందితే ఈ తేడాలు ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. ఈ అధ్యయనం సహరచయిత నాథన్‌ ట్రెఫ్‌ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత చివరికి ఐవీఎఫ్‌ రోగులకు సహాయపడుతుందని అన్నారు.

నైతిక, భద్రతా ప్రమాదాలపై నిపుణుల హెచ్చరిక
మానవ పిండాలను ఎడిట్‌ చేయడం వల్ల కలిగే దీర్ఘకాలిక పరిణామాల గురించి కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. గణనీయమైన అనిశ్చితులు ఉన్న సాంకేతికతను ప్రవేశపెట్టడం అవసరమా అని కాలిఫోర్నియా యూనివర్సిటీ జన్యు శాస్త్రవేత్త ఫ్యోడోర్‌ ఉర్నోవ్‌ ప్రశ్నించారు. వ్యాధులను నివారించడం కంటే లక్షణాలను మెరుగుపరుచుకోవడానికి చూసే వ్యక్తులు ఈ పరిశోధనను ఉపయోగించుకొనే ప్ర మాదం ఉందని ఉర్నోవ్‌ హెచ్చరించారు. ఒకేసారి ఎక్కువ జన్యువులను ఎడిట్‌ చేయడానికి ప్రయత్నిస్తే వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్‌ ఎగ్లీ పేర్కొన్నారు. ఏదైనా క్లినికల్‌ వినియోగాన్ని పరిశీలించే ముందు ప్రధాన శాస్త్రీయ, వైద్య, నైతిక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు.