Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తెలంగాణలో క్రీడల పండగ

Author MANA VISHWAM | 13 Aug 2026, 07:22 PM | TELANGANA
తెలంగాణలో క్రీడల పండగ

దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచే ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. డిసెంబరు 11 నుంచి 22 వరకు 12 రోజులపాటు జరిగే ఈ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. దేశం దృష్టిని ఆకర్షించేలా అత్యున్నత ప్రమాణాలతో క్రీడలను నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తోంది.
రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం గురువారం దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయను కలిసింది. ఖేలో ఇండియా పోటీల నిర్వహణ, ఏర్పాట్లు, క్రీడా మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించింది. క్రీడల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ శివసేనరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.


మోదీకి సీఎం ఆహ్వానం

ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరఫున కేంద్ర క్రీడల మంత్రికి ఆహ్వాన లేఖ అందించారు. పోటీలకు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సీఎం త్వరలో ఆయన అపాయింట్‌మెంట్‌ కోరనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి


లోటుపాట్లకు తావులేకుండా..

12 రోజులపాటు జరిగే పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు శ్రీహరి తెలిపారు. క్రీడాకారులకు వసతి, రవాణా, పోటీ వేదికలు, ఇతర సదుపాయాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకునే స్థాయిలో పోటీలను నిర్వహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.


గ్రామీణ ప్రతిభకు పెద్దపీట

రాష్ట్రంలో క్రీడారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధితోపాటు యువతను క్రీడలవైపు ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఖేలో ఇండియా పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా జాతీయ క్రీడా పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. ఈ పోటీలు రాష్ట్రంలో క్రీడా సంస్కృతికి కొత్త ఊపు ఇవ్వడంతోపాటు యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.