Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

'బాస్' లేని వరంగల్ పోలీసింగ్..!

Author MANA VISHWAM | 03 Jul 2026, 07:55 AM |
'బాస్' లేని వరంగల్ పోలీసింగ్..!

రెండు నెలలుగా ఖాళీగా ఏసీపీ పోస్టు.. ఇన్‌ఛార్జ్‌తోనే సబ్‌డివిజన్ పరిపాలన

వరంగల్ ప్రతినిధి, జులై2(మన విశ్వం):వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన వరంగల్ సబ్‌డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) పోస్టు గత రెండు నెలలుగా ఖాళీగా ఉండటం పోలీసు పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సబ్‌డివిజన్‌కు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ప్రస్తుతం హనుమకొండ ఏసీపీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వరంగల్ డివిజన్‌లో పోలీసు పరిపాలన ఇన్‌ఛార్జ్ వ్యవస్థకే పరిమితమైందని, ప్రజలకు సత్వర సేవలు అందడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వరంగల్ సబ్‌డివిజన్‌కు తొలి ఐపీఎస్ అధికారిగా పనిచేసిన శుభం ప్రకాశ్ ఈ ఏడాది ఏప్రిల్ 21న బదిలీపై వెళ్లిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం కొత్త అధికారిని నియమించలేదు. రెండు నెలలు గడిచినా ఖాళీని భర్తీ చేయకపోవడంపై ప్రజలతో పాటు పోలీసు వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.

బాధితులకు హనుమకొండ బాట

వరంగల్ సబ్‌డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ, ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ పోలీస్ స్టేషన్లు నగరంలో అత్యంత రద్దీ పోలీస్ స్టేషన్లుగా గుర్తింపు పొందాయి. రోజూ అనేక మంది బాధితులు తమ ఫిర్యాదులు, అప్పీలు, వివాదాల పరిష్కారం కోసం ఏసీపీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే స్థానికంగా అధికారి లేకపోవడంతో ప్రతి చిన్న అంశానికీ హనుమకొండలోని ఏసీపీ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది.దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలు అదనపు ప్రయాణ భారం భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒక పని కోసం పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొనడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.


రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతం

ఇవి కూడా చదవండి

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈ సబ్‌డివిజన్ రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనలు, సభలు తరచూ ఇక్కడే జరుగుతుంటాయి. ప్రస్తుతం అధికార పార్టీలోనూ వర్గపోరు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత సవాలుగా మారాయని అధికారులు భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి ఏసీపీ లేకపోవడం శాంతిభద్రతల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అధికారులకు ‘హాట్‌సీట్’గా వరంగల్

వరంగల్ సబ్‌డివిజన్‌లో పనిచేయడం ఎప్పటి నుంచో అధికారులకు సవాల్‌గా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు అధికారులపై రాజకీయ ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి.కొంతమంది అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోగా, మరికొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బదిలీలు కోరుకుని వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతుంది . దీంతో ఈ పోస్టును స్వీకరించడమే అధికారులకు సవాల్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం స్పందించాలంటున్న ప్రజలు

కమిషనరేట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వరంగల్ సబ్‌డివిజన్‌ను ఎక్కువకాలం ఇన్‌ఛార్జ్ పాలనలో కొనసాగించడం సరైన విధానం కాదని ప్రజలు అంటున్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, బాధితులకు సత్వర న్యాయం, కీలక కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి వరంగల్ సబ్‌డివిజన్‌కు పూర్తిస్థాయి ఏసీపీని నియమించాలని ప్రజలు, న్యాయవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

ప్రజల భద్రత, సమర్థవంతమైన పోలీసు పరిపాలన కోసం వరంగల్ కు పూర్తిస్తాయి ఏసీపీ నియామకం ఇక అత్యవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.