Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

డీఎస్పీ ‘అవినీతి సామ్రాజ్యం’ బద్దలు!

Author MANA VISHWAM | 03 Jul 2026, 08:20 AM | Crime
డీఎస్పీ ‘అవినీతి సామ్రాజ్యం’ బద్దలు!

డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్.. రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తుల గుట్టురట్టు

తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ ఇళ్లపై ఏకకాలంలో దాడులు

హైదరాబాద్–బెంగళూరు సహా 15 ప్రాంతాల్లో సోదాలు..
రహస్య డైరీతో 15 మంది బినామీల గుర్తింపు

2 కిలోల బంగారం, భారీ నగదు, విలాసవంతమైన ఆస్తుల పత్రాలు స్వాధీనం

హైదరాబాద్, జూలై 2 (మన విశ్వం): తెలంగాణలో మరో సంచలన అవినీతి కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెలుగులోకి తీసుకొచ్చింది. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పనిచేస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ స్థాయిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతాలు కలిపి మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
ప్రాథమిక విచారణలోనే భీంరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట భారీ స్థాయిలో స్థిర, చరాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు, సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


'రహస్య డైరీ'తో బినామీల గుట్టురట్టు

ఇవి కూడా చదవండి

సోదాల్లో అత్యంత కీలక ఆధారంగా ఓ వ్యక్తిగత డైరీ ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. భీంరెడ్డి స్వయంగా నిర్వహించినట్లు భావిస్తున్న ఈ డైరీలో సుమారు 15 మంది బినామీల వివరాలు నమోదై ఉన్నట్లు సమాచారం. ఆ డైరీ ఆధారంగా మరిన్ని ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమికంగా గచ్చిబౌలిలో కూతురు పేరిట విలాసవంతమైన ఫ్లాట్, బెంగళూరు దేవనహళ్లి పరిసరాల్లో ఖరీదైన భూమి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు లభించాయి. తెలుగు రాష్ట్రాలకు వెలుపల కూడా భారీ పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో బయటపడింది.


వెలుగులోకి వచ్చిన ఆస్తుల చిట్టా

సోదాల్లో భీంరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న పలు విలాసవంతమైన ఆస్తుల పత్రాలు స్వాధీనం అయ్యాయి. వాటిలో ప్రధానంగా...
•హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లో వెస్సెల్లా మెడోస్‌లో లగ్జరీ విల్లా
టెలికాం నగర్‌లో జీ+2 భవనం
•సాయి ప్రభా రెసిడెన్సీలో ఫ్లాట్
•గచ్చిబౌలి క్రాంతి సియాన్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్
•మణికొండ లంకోహిల్స్ రోడ్డులో జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా
•మణికొండలో 3,000 చదరపు అడుగుల కమర్షియల్ స్థలం
తెల్లాపూర్‌లో రెండు ఫ్లాట్లు
•ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల స్థలం
•జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి
•ముచ్చింతల్‌లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి
•మొమిన్‌పేట్‌లో స్థలం, వ్యవసాయ భూమి
•నాగోల్‌లో ప్లాట్
•పటాన్‌చెరులో మూడు ప్లాట్లు
•కర్ణాటకలో 6 ఎకరాలు, 38 ఎకరాల వ్యవసాయ భూములు
బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం విలువైన భూమి
•ఎం ఎస్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి

నగదు, బంగారం భారీగా స్వాధీనం

సోదాల్లో డీఎస్పీ నివాసం నుంచి రూ.3.60 లక్షల నగదు, ఓ బినామీ ఇంటి నుంచి రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు రెండు కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నగదు నిల్వలను గుర్తించారు.

రూ.200 కోట్లకు పైగా మార్కెట్ విలువ?

అధికారిక పత్రాల్లో ఆస్తుల విలువ తక్కువగా నమోదై ఉన్నప్పటికీ, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లు తెరిచిన తర్వాత మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశముందని, విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.