Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

తడిబట్టల డ్రామాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.. భద్రకాళి క్షేత్రాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు

Author MANA VISHWAM | 04 Jul 2026, 01:20 PM | వరంగల్
తడిబట్టల డ్రామాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.. భద్రకాళి క్షేత్రాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు

రాజకీయ స్వార్థం కోసం ఆలయాన్ని వాడుకోవడం హేయమైన చర్య

​అమ్మవారి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు

తడిబట్టల డ్రామాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.. భద్రకాళి క్షేత్రాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు - Additional Image

​సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన నేతలపై మండిపాటు


భారతదేశంలోనే చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం, ఓరుగల్లు నగర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ రాజకీయ ఉనికి కోసం, ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం ఆలయ నియమాలను తుంగలో తొక్కి, భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగించిన ఇరు పార్టీల నేతల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.

తడిబట్టల డ్రామాలతో ఆలయ పవిత్రతను దెబ్బతీశారు.. భద్రకాళి క్షేత్రాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు - Additional Image

​ఆలయాన్ని మైలపరిచిన తడిబట్టల డ్రామాలు

​మాజీ 'కూడా' చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ప్రస్తుత 'కూడా' చైర్మన్ ఇనగాల వెంకట్రామ రెడ్డి ఇద్దరూ కలిసి తడిబట్టలతో అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి ప్రమాణాలు చేయడం శాస్త్ర విరుద్ధమని గంట రవికుమార్ పేర్కొన్నారు.
​"ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ అక్రమ సంపాదన కూడబెట్టుకుంటున్న ఇరు పార్టీల నాయకులు.. ఆలయాల్లో తడిబట్టలతో డ్రామాలాడటం సిగ్గుచేటు. వీరి స్వార్థ రాజకీయం వల్లే అమ్మవారి ఆలయం మైలపడింది. అవినీతి ఆరోపణలు ఉంటే విచారణ సంస్థల ముందు లేదా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప, పవిత్రమైన దేవాలయాన్ని రాజకీయ పంచాయితీలకు వేదికగా మార్చడం తగదు."అని గంటా రవికుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి


​ఆలయాన్ని శుద్ధి చేసిన బీజేపీ శ్రేణులు

​రాజకీయ నాయకుల అపవిత్ర చర్యల వల్ల, అక్కడ సృష్టించిన హంగామా వల్ల మైలపడిన భద్రకాళి ఆలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు పసుపు నీళ్లతో, గంగా, గోదావరి శుద్ధ జలాలతో కడిగి సంప్రోక్షణ (శుద్ధి) చేశారు. అమ్మవారి ఆలయ గౌరవాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడటం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతల హంగామా వల్ల సామాన్య భక్తులు గంటల తరబడి దర్శనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

​విఫలమైన అధికారులు, పోలీసులు

​దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్న ఇలాకాలోనే దేవాలయాలు అపవిత్రం అవడం బాధాకరమని రవికుమార్ అన్నారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా గర్భాలయ పరిసరాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే దేవస్థానం ఈవో, అధికారులు అధికార పక్ష ఒత్తిళ్లకు లొంగి మౌనంగా ఉండిపోయారని, ఆలయ పవిత్రతను కాపాడటంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే, వరంగల్ నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ముందస్తు సమాచారం ఉన్నా చూసి చూడనట్లు వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

​భక్తులకు క్షమాపణ చెప్పాలి

​గత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల వరంగల్‌కు ఒరిగింది ఏమీ లేదని, కుడా పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే వీరి పనిగా మారిందని ఆరోపించారు. ఏ దేవాలయం వద్ద అయినా గేటు బయట రాజకీయాలు చేయాలి తప్ప, గర్భగుడి పరిసరాల్లో కాదని హితవు పలికారు. ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించినందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భక్తులకు, హిందూ సమాజానికి తక్షణమే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో భద్రకాళి మాత భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని గంట రవికుమార్ హెచ్చరించారు.