Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మసాలాల్లో మహా మోసం..!

Author MANA VISHWAM | 04 Aug 2026, 09:14 PM | Crime
మసాలాల్లో మహా మోసం..!

నగరంలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్), జీహెచ్‌ఎంసీ ఆహార భద్రత శాఖ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా కల్తీ మసాలా దినుసులు పట్టుబడ్డాయి. ప్రజల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా మసాలా దినుసుల వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాలపై మంగళవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. మొత్తం 13 సంస్థలను తనిఖీ చేయగా, హానికర రసాయనాలతో కల్తీ చేసిన 25,300 కిలోల మసాలా దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో మసాలా దినుసుల రంగు, మెరుపు, బరువు పెంచి అక్రమ లాభాలు పొందేందుకు పారిశ్రామిక రంగులు, కృత్రిమ ఆహార రంగులు, టాల్కం పొడి, బియ్యం తవుడు నూనెతో పాటు తినడానికి అనర్హమైన ఇతర పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలు, ఆవాలు, సోంపు వంటి మసాలా దినుసుల్లో ఈ హానికర పదార్థాలు కలిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వ్యవహారంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేశారు. మొత్తం మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు వెల్లడించారు. కేసులపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దాడుల సందర్భంగా 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులతో పాటు 89,150 కిలోల ముడి పదార్థాలు, 12 లీటర్ల బియ్యం తవుడు నూనె, 1.5 కిలోల కృత్రిమ, పారిశ్రామిక రంగులు, మూడు రోలింగ్ యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలన కోసం సంబంధిత శాఖల ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార కల్తీని ఏమాత్రం సహించబోమని పోలీసులు, ఆహార భద్రత శాఖ స్పష్టం చేశాయి. ఆహార పదార్థాల తయారీ, విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించాయి. అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. ఆహార భద్రత పరిరక్షణ కోసం నగరవ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలని, కల్తీపై అనుమానం ఉన్న వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.