Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పోరాటాల ‘పెద్ది’.. జ్ఞాపకాల్లో పదిలం

Author MANA VISHWAM | 10 Aug 2026, 06:24 PM | వరంగల్
పోరాటాల ‘పెద్ది’.. జ్ఞాపకాల్లో పదిలం

పెద్ది లేని నర్సంపేటను ఊహించలేదు

ఆసుపత్రిలో నా ప్రాణాలు కాపాడిన వ్యక్తినే.. అక్కడ చివరిచూపు చూడాల్సి వచ్చింది

పోరాటాల ‘పెద్ది’.. జ్ఞాపకాల్లో పదిలం - Additional Image

ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు ఆయనది చెరగని ముద్ర


సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమైన హరీశ్‌రావు

పోరాటాల ‘పెద్ది’.. జ్ఞాపకాల్లో పదిలం - Additional Image

నల్లబెల్లి, ఆగస్టు 10 (మన విశ్వం): ‘‘ఉద్యమ సమయంలో నేను గాయపడితే ఆసుపత్రిలో చేర్పించి నా ప్రాణాలు కాపాడింది పెద్ది సుదర్శన్‌రెడ్డి. అదే ఆసుపత్రిలో ఆయనను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నల్లబెల్లిలో జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పెద్ది జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులను లెక్కచేయకుండా పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడని కొనియాడారు. మానుకోట ఘటన నుంచి పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఉపఎన్నికల వరకు ప్రతి పోరాటంలో ముందుండేవారని చెప్పారు. ‘‘సమైక్యవాదులను అడ్డుకునే క్రమంలో బుల్లెట్లు, రాళ్లను సైతం లెక్కచేయలేదు. తెలంగాణ సాధించే వరకు రాష్ట్రం కోసం.. రాష్ట్రం వచ్చాక నర్సంపేట అభివృద్ధి కోసం తపించారు’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి


గోదావరి జలాల వెనుక పెద్ది కృషి

రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లు తీసుకురావడంలో పెద్ది కృషి మరువలేనిదని హరీశ్‌రావు అన్నారు. రైతులు రెండు పంటలు పండించాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ను ఒప్పించి గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని తెలిపారు. జిల్లా కేంద్రం కానప్పటికీ నర్సంపేటకు మెడికల్‌ కళాశాల రావడం వెనుక కూడా పెద్ది పట్టుదల ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించిన కేసీఆర్‌ క్యాబినెట్‌ హోదాతో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు.


నెలన్నర ఒకే ఇంట్లో ఉన్నాం

ఉద్యమ రోజుల నాటి అనుబంధాన్ని హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. ‘‘నేను, పెద్ది గతంలో బియ్యాల జనార్దన్‌ సార్‌ ఇంట్లో దాదాపు నెల నుంచి 40 రోజులపాటు కలిసి ఉన్నాం. పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఉపఎన్నికల్లో బాధ్యతలు భుజాన వేసుకుని పనిచేశాం. అప్పట్లో ఆయనకు అన్నం, నిద్ర, ఆకలి అనే ధ్యాసే ఉండేది కాదు. తెలంగాణ సాధించాలన్న తపనే కనిపించేది’’ అని చెప్పారు.
కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన ఆలయం కూల్చివేతకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనే తామిద్దరం కలిసి పాల్గొన్న చివరి కార్యక్రమమని తెలిపారు. ‘‘అదే మా చివరి కలయిక అవుతుందని అనుకోలేదు. పెద్ది లేని సమావేశంలో.. అదీ నర్సంపేట గడ్డపై నేను పాల్గొంటానని ఎప్పుడూ ఊహించలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.


‘చివరి శ్వాస వరకు పోరాడారు’

కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఒత్తిడి చేసినా సుదర్శన్‌రెడ్డి తలొగ్గలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలపై ఉద్యమకాలం నాటి పోరాట స్ఫూర్తితో చివరి శ్వాస వరకు పోరాడారని పేర్కొన్నారు.
సుదర్శన్‌రెడ్డిని కాపాడేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, అవసరమైతే అమెరికా లేదా లండన్‌ నుంచి వైద్యులను రప్పించాలని కేసీఆర్‌ చెప్పారని హరీశ్‌రావు తెలిపారు. ‘‘పెద్ది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు కేసీఆర్‌ అండగా ఉంటారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆయన కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది’’ అని భరోసా ఇచ్చారు. సుదర్శన్‌రెడ్డి మృతి నర్సంపేటకో, ఉమ్మడి వరంగల్‌కో మాత్రమే కాకుండా తెలంగాణకు, బీఆర్‌ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు.