Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘పంద్రాగస్టునా.. 420 మాటలేనా?’

Author MANA VISHWAM | 15 Aug 2026, 08:15 PM | సిద్దిపేట
‘పంద్రాగస్టునా.. 420 మాటలేనా?’

రేవంత్‌ ప్రసంగమంతా అబద్ధాలేనని హరీశ్‌రావు ధ్వజం

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించాల్సిన వేళ రాజకీయ విమర్శలా?


సిద్దిపేట, ఆగస్టు 15(మన విశ్వం) : స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడాల్సింది పోయి.. రాజకీయ విమర్శలు, చిల్లర మాటలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో సీఎం చేసిన ప్రసంగంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలకన్నా రాజకీయ విమర్శలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 420 హామీలు.. రేవంత్‌ ప్రసంగంలో 420 అబద్ధాలు.. అన్నీ 420 మాటలే’’ అంటూ ఎద్దేవా చేశారు.
సిద్దిపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకోవడం, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రజలకు వివరించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు దేశ, రాష్ట్ర అభివృద్ధి, సమగ్రత, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్‌ లక్ష్యాలపై మాట్లాడతారని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ఆ సందర్భాన్నీ రాజకీయ విమర్శలకే ఉపయోగించుకున్నారని ఆరోపించారు.


‘సంగారెడ్డికి ఏం ఇచ్చారో చెప్పలేదు’

‘‘ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డికి వచ్చి అక్కడి ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి ఒక్క మాటైనా మాట్లాడారా? జిల్లాకు కొత్తగా ఒక్క రూపాయి విలువైన హామీ అయినా ఇచ్చారా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఏమిటని నిలదీశారు.
సింగూరు జలాశయాన్ని మరమ్మతుల పేరుతో ఖాళీ చేయడం వల్లే మూడు జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తాయని ఆరోపించారు. ‘‘నారాయణఖేడ్‌ సహా పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులకోసారి నల్లా నీళ్లు వస్తున్నాయి. ప్రజలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇస్తారా? బోర్లు వేస్తారా? మోటార్లు ఏర్పాటు చేస్తారా? రోజూ తాగునీరు అందించేందుకు ఏం చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాల్సింది’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి


‘కరువులోనూ కేసీఆర్‌ నీళ్లిచ్చారు’

గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన వేసవిలోనూ రాష్ట్రంలోని గ్రామాలు, తండాలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సింగూరును ఖాళీ చేసినా చెప్పిన మరమ్మతులను పూర్తి చేయలేదని ఆరోపించారు. దాని ఫలితంగానే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.


‘సంగమేశ్వర.. బసవేశ్వర ఏమయ్యాయి?’

సంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను పక్కనపెట్టిందని ఆరోపించారు. జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కనీసం ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, నిర్ణీత గడువులో సాగునీరు అందిస్తామని ప్రకటిస్తారని ప్రజలు ఆశించారని చెప్పారు.
‘‘జిల్లా ప్రజలకు అవసరమైన సాగునీరు, తాగునీరు, అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా రాజకీయ విమర్శలతో ప్రసంగాన్ని ముగించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి స్వాతంత్య్ర దినోత్సవ వేదిక గౌరవాన్ని కాపాడాలి’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.


‘మూడేళ్లయినా అదే ప్రచారం’

ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు అవుతున్నా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి ప్రసంగం 4:20 గంటలకు మొదలైంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 420 హామీలు.. ప్రసంగంలోనూ 420 అబద్ధాలు. ప్రజల సమస్యలకు సమాధానం మాత్రం లేదు’’ అంటూ ఎద్దేవా చేశారు.